Mahaa Daily Exclusive

  అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. భర్త చేసిన మోసానికి టీచర్‌కు శిక్ష..

Share

  • భర్త చేసిన మోసానికి టీచర్‌కు శిక్ష
  •  దామరగిద్ద గ్రామంలోఅమానుషం

సంగారెడ్డి,మహా

నాగల్‌గిద్ద మండలంలోని దామరగిద్ద గ్రామంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల గొడవలో ఒక మహిళా అంగన్‌వాడీ టీచర్‌ను గ్రామస్తులు అతి కిరాతకంగా చెట్టుకు కట్టేసి అవమానించారు. చదువు చెప్పే గురువు అని చూడకుండా, మహిళా అని కనికరం లేకుండా ప్రవర్తించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని కళ్ళకు కడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ వసంత కుమారి భర్త ప్రభాకర్ గతంలో హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో ఒక ఆర్థిక సంస్థను నడిపేవారు. అధిక వడ్డీలు, ఇతర ఆశలు చూపి గ్రామంలోని పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అయితే, కొంతకాలంగా ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడమే కాకుండా, ఇటీవల ప్రభాకర్ గ్రామం వదిలి ఎవరికీ తెలియకుండా పారిపోయారు. దీంతో తమ డబ్బు పోయిందన్న ఆందోళనలో ఉన్న బాధితులు, ఆయన భార్య అయిన వసంత కుమారిని లక్ష్యంగా చేసుకున్నారు.

వసంత కుమారిని అడ్డగించిన బాధితులు మరియు గ్రామస్తులు, ఆమెను తీవ్రంగా నిలదీశారు. తన భర్త ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని ఆమె మొత్తుకున్నప్పటికీ, ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఆమెను బలవంతంగా లాక్కెళ్లి గ్రామ మధ్యలోని ఒక చెట్టుకు తాళ్లతో కట్టేశారు. అందరూ చూస్తుండగానే ఆమెను అవమానకర రీతిలో దూషించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని, బాధితురాలిని బంధ విముక్తురాలిని చేశారు. భర్త చేసిన తప్పుకు భార్యను బాధ్యురాలిని చేస్తూ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Latest