- అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ వణుకు
- యూనిఫాం – అవినీతి కలిసి ఉండలేవు: డిజిపి
హైదరాబాద్, మహా
“యూనిఫాం మరియు అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు” అని బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి రాసిన బహిరంగ లేఖలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. హోమ్ గార్డు నుండి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, పారదర్శకతతో పనిచేయాలని, పోలీస్ స్టేషన్లను సివిల్ సెటిల్మెంట్లకు వేదికగా మార్చవద్దని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే, డీజీపీ స్థాయి అధికారి ఇంతటి కఠిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు తమ పాత పద్ధతులను మార్చుకోవడం లేదనే విషయం ఏసీబీ వరుస దాడులతో స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా పర్యవేక్షణలో అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తన వేగాన్ని పెంచింది. తాజాగా, శంషాబాద్‌లోని ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్టులో ఇన్‌స్పెక్టర్ సంపాతి కనకయ్య మరియు ఎస్సై యు.కె. సిద్ధేశ్వర్ ఒక కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రెండు లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏకంగా రూ. 33,97,000 నగదు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. అలాగే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్ ఒక నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
అవినీతి జాడ్యం కేవలం నగరాలకే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ కొనసాగుతుండటం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ ఎస్సై టి. అశోక్ తనపై ఉన్న ఫిర్యాదును మాఫీ చేసేందుకు, మాదాపూర్ ఎస్సై గాండ్ర వినయ్ నోటీసులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్‌లోని కేయూసీ ఎస్సై పి. శ్రీకాంత్ సీజ్ చేసిన వాహనాల విడుదల కోసం లంచం తీసుకుంటూ పట్టుబడగా, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ములుగు ఎస్సై విజయ్ కుమార్ కూడా ఏసీబీకి దొరికిపోయారు. మెదక్ జిల్లా టేక్మల్ ఎస్సై రాజేష్ అయితే ఏసీబీ అధికారులను చూసి పొలాల్లోకి పారిపోగా, అధికారులు వెంటాడి పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా పోలీస్ సిబ్బంది తమ పనితీరును మార్చుకొని “ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ , ప్రొఫెషనల్” పోలీసింగ్ వైపు అడుగులు వేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ చారు సిన్హా ప్రజలను కోరారు.







