Mahaa Daily Exclusive

  పొంగులేటి కాదు అతడు పొంగు లూటీ..! మంత్రి పొంగులేటిపై హరీష్ రావు ఆగ్రహం..

Share

  • మంత్రి పొంగులేటిపై హరీష్ రావు ఆగ్రహం
  •  తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పు

 

వనపర్తి,మహా

“పొంగులేటి కాదు.. అతడు ‘పొంగు-లూటీ’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. మంత్రి హోదా మరిచి కేవలం ‘రాఘవ కన్స్ట్రక్షన్’ యజమానిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అవినీతి బాగోతం బట్టబయలవడంతోనే ‘బాంబులేటి’ బాంబులన్నీ తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే రాఘవ కంపెనీ అక్రమాలను ఒప్పుకొని జరిమానా వేశాక, ఇప్పుడు సంబంధం లేదని బుకాయించడం ప్రజలను వంచించడమేనని, ఆ దమ్ముంటే వివాదాస్పద భూములపై హైడ్రాను పంపించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హరీష్ రావు సవాల్ విసిరారు.”

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొంగులేటిని ‘పొగరులేటి’, ‘పొంగులూటీ’ , ‘బాంబులేటి’ అంటూ ఎద్దేవా చేశారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో కూర్చుని పొంగులేటి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో డిఫెన్స్ లో పడి బూతులు, తిట్లు, పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా, తన కొడుకును కాపాడుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.

రాఘవ కన్స్ట్రక్షన్‌లో జరిగిన అవినీతిని సాక్షాత్తూ ముఖ్యమంత్రే అంగీకరించారని, మైనింగ్ శాఖ ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించి ఫైన్ కూడా వేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. “ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా? లేక అధికారుల నివేదికలు తప్పా?” అని ఆయన నిలదీశారు. రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న కంటైనర్ మీద కాంగ్రెస్ జెండా ఎందుకు ఉందని, పీసీబీ మరియు మైనింగ్ అధికారులు నోటీసులు ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆధారాలు చూపించినప్పుడు నోరు మెదపని ‘బాంబులేటి’ ఇప్పుడు బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు.

నాదార్ గుల్ భూముల వ్యవహారంలోనూ మంత్రి తీరును హరీష్ రావు తప్పుబట్టారు. ఆ భూములను కాపాడింది, హైకోర్టులో పోరాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒకవేళ అవి ప్రభుత్వ భూములే అయితే, గత రెండున్నర ఏళ్లుగా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, రోజుకో పేరుతో బోర్డులు ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడతామని చెప్పే ‘హైడ్రా’ ఇక్కడ గడ్డి పీకుతుందా అని నిలదీశారు. పొంగులేటికి నిజాయతీ ఉంటే, ఆ భూములపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. “పొగరు తగ్గించుకో పొంగులేటి.. నీ బాంబులన్నీ తుస్సుమన్నాయి. నీ అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటపెడతాం” అని హెచ్చరించారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Latest