Mahaa Daily Exclusive

  రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య అలర్ట్..

Share

  • శాతవాహన గోల్కొండ సహా రైళ్లు రద్దు.
  • రాయనపాడు పనులతో పట్టాలపై రైళ్ల బ్రేక్.

హైదరాబాద్, మహా.
తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం ప్రయాణించే వేలాది మంది రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. విజయవాడ సమీపంలోని రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ పనుల కారణంగా శాతవాహన, గోల్కొండ మరియు గౌతమి వంటి అత్యంత రద్దీగా ఉండే రైళ్లు కూడా రద్దు కావడం గమనార్హం.
రాయనపాడు పనుల ప్రభావంతో ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు విజయవాడ – భద్రాచలం రోడ్ (67215/16) మరియు విజయవాడ – డోర్నకల్ (67768/67) మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా, నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (12713/14) మే 2వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు పట్టాలెక్కదు. గుంటూరు – సికింద్రాబాద్ – విజయవాడ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (17201/02) మరియు గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12705/06) కూడా మే 2 నుండి 5వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
దూరప్రాంత ప్రయాణికులు ఎక్కువగా ఆశ్రయించే విశాఖపట్నం – మహబూబ్‌నగర్ – విశాఖపట్నం (12861/62) రైళ్లతో పాటు, కాకినాడ పోర్ట్ – లింగంపల్లి – కాకినాడ పోర్ట్ మధ్య నడిచే గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/38) మే 1 నుండి 5వ తేదీ వరకు నిలిచిపోనున్నాయి. వీటితో పాటు కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775/76) రైళ్లు మే 3, 4 తేదీల్లో రద్దయ్యాయి. సంబల్‌పూర్ – హెచ్.ఎస్. నాందేడ్ (20809/10) రైళ్లు మే 1 నుండి 5 వరకు, విశాఖపట్నం – హెచ్.ఎస్. నాందేడ్ (20811/12) రైళ్లు మే 2, 3 తేదీల్లో రాకపోకలు సాగించవు. ఈ భారీ రద్దుల నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని, స్టేషన్‌కు వచ్చే ముందు రైళ్ల స్థితిగతులను అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Latest