- ఏప్రిల్ 13 నుంచి ‘అరైవ్ అలైవ్’.
- కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టి, విలువైన ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, గురువారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారి భద్రత చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాహనాల సంఖ్య పెరగడం, మితిమీరిన వేగం, డ్రైవర్ల అజాగ్రత్త వంటి కారణాల వల్ల ప్రమాదాలు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సంబంధించి సీఎస్ స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్ 13న గ్రామ స్థాయిలో రహదారి భద్రతా కమిటీల ఏర్పాటుతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు, ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయిస్తారు. 15వ తేదీని ‘చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ డే’గా నిర్వహిస్తూ, ముఖ్యంగా నాలుగేళ్లు దాటిన చిన్నారులకు కూడా సీటు బెల్టుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. 16న ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించేలా ప్రత్యేక ప్రచారం నిర్వహించడంతో పాటు, సామాజిక మాధ్యమాల ద్వారా వారు ప్రజలను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. 17న ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడేందుకు అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’ అత్యవసర చికిత్సపై శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. చివరి రోజైన 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో ప్రవర్తనా మార్పు తీసుకురావాలని సీఎస్ సూచించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదని, వివిధ శాఖల సమన్వయంతో సాగే సమగ్ర ప్రక్రియ అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు పాదచారులు, ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారని, వారిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో రహదారి భద్రత విషయంలో గణనీయమైన పురోగతి సాధించామని, ఇదే స్ఫూర్తితో మున్ముందు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జోంగ్తూ, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంకతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








