Mahaa Daily Exclusive

  గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధం చేయండి.. భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం..

Share

హైదరాబాద్‌, మహా.

రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న గోదావరి నదీ పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి నుంచి మొదలుకొని బాసర, భద్రాచలం వరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తోందని, ఈ ప్రాంతాల్లోని పుష్కర ఘాట్ల వద్దకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా తరలివచ్చే భక్తజనానికి ఎక్కడా చిన్నపాటి ఇబ్బంది కూడా ఎదురుకాకుండా ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

పుష్కర ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను అందించారని, వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ప్రతిపాదన ఉండాలని సీఎస్‌ సూచించారు. ఈ మెగా ఈవెంట్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, ఘాట్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం మరియు భద్రత వంటి అంశాలపై సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను తక్షణమే గోదావరి పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాల్సిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను, అవసరాలను పర్యవేక్షించడానికి ఇప్పటికే ఈ.ఎన్.సి.లు మరియు చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీని నియమించామని, ఈ కమిటీ సభ్యులు ప్రతిపాదిత పనులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు.

దేవాలయాల ఆధునీకరణతో పాటు భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు, స్నానఘాట్ల వద్ద రక్షణ చర్యలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమావేశంలో చర్చించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుని భక్తులకు మెరుగైన సేవలందించాలని సీఎస్‌ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేసి, గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రతిష్ట పెరిగేలా విజయవంతం చేయాలని సీఎస్‌ రామకృష్ణారావు ఆకాంక్షించారు.

Latest