Mahaa Daily Exclusive

  రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలపై హైకోర్టు గర్జన..

Share

  • జూన్ 10 లోగా కేసుల వారీ నివేదిక సమర్పించాలి.

హైదరాబాద్‌, మహా.

రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల చెల్లింపు విషయంలో తెలంగాణ హైకోర్టు గురువారం అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, వచ్చే విచారణ నాటికి అంటే జూన్ 10వ తేదీలోగా కేసుల వారీగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయడంలో విఫలమైతే, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రతి విచారణకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్లీడర్‌కు కచ్చితమైన దిశానిర్దేశం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

గురువారం నాటి విచారణ సందర్భంగా కోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 764 కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు రాగా, ప్రభుత్వం నుంచి అందుతున్న చెల్లింపుల గణాంకాలపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ప్లీడర్ వాదనలు వినిపిస్తూ.. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన కొన్ని పదుల కేసులు మినహా, ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన దాదాపు అందరు ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని నివేదించారు. అయితే, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, కేవలం మూడో వంతు కేసుల్లో మాత్రమే ప్రభుత్వం ఆదేశాలను పాటించిందని, మిగిలిన వారందరూ ఇంకా నిధుల కోసం నిరీక్షిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, మార్చి 23వ తేదీ కాజ్ లిస్టులో ఉన్న పిటిషనర్లందరికీ బకాయిలు చెల్లించి, ఆ వివరాలను విడివిడిగా నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు.

తెలంగాణలో గత రెండేళ్లుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న అంశం ఈ విచారణ ద్వారా మరోసారి బహిర్గతమైంది. 2024 మార్చి నుంచి సుమారు 15,000 మంది ఉద్యోగులు రిటైర్ కాగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. నెలల తరబడి వేచి చూసినా ఫలితం లేకపోవడంతో వందలాది మంది హైకోర్టును ఆశ్రయించగా, 6 నుంచి 10 వారాల్లోపు బకాయిలు చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణలో కోర్టు విధించిన ఏప్రిల్ 9వ తేదీ గడువు ముగియడానికి కేవలం 48 గంటల ముందు ప్రభుత్వం హడావిడిగా కొన్ని నిధులను విడుదల చేయడం గమనార్హం.

రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సి.ఆర్. సుకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం కోర్టు గడువులను పదేపదే పొడిగించుకుంటూ వెళ్తోందని, ఇప్పటికీ చాలా మందికి పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కేసుల వారీగా నివేదిక సమర్పిస్తేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాపై ఉన్న ఒత్తిడిని సాకుగా చూపి వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కాలరాయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. వచ్చే జూన్ నెలలో జరగబోయే విచారణలో ప్రభుత్వం సమర్పించే నివేదిక ఆధారంగా కోర్టు తదుపరి చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల వ్యక్తిగత హాజరుపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Latest