Mahaa Daily Exclusive

  కాళేశ్వరం మరమ్మతులకు సీఎం గ్రీన్ సిగ్నల్..! ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రేవంత్ రెడ్డి ఆదేశం…

Share

  • యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ పునరుద్ధరణ పనులు.
  •  ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రేవంత్ రెడ్డి ఆదేశం.

హైదరాబాద్, మహా.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాజెక్టులోని మూడు ప్రధాన బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం , సుందిళ్లను తక్షణమే మరమ్మతులు చేసి, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రాజెక్టు భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన శాస్త్రీయ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, వీలైనంత త్వరగా ఈ పునరుద్ధరణ పనులను పట్టాలెక్కించాలని ఆయన సూచించారు.

బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, దీనిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలం దృష్ట్యా, జూన్ లోపు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని ఆయన భావిస్తున్నారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు , నమూనాల సేకరణ ప్రక్రియను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు. ఈ క్రతువులో నీటిపారుదల శాఖతో పాటు సీడబ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు మరియు డిజైన్ కన్సల్టెంట్లతో కూడిన ఒక సమన్వయ బృందాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పనిలోనూ సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుల భాగస్వామ్యం ఉండేలా చూస్తూ, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఆయన నొక్కి చెప్పారు.

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అధికారులు ముఖ్యమంత్రికి ఒక కీలక నివేదికను సమర్పించారు. బ్యారేజీలో కేవలం కుంగిపోయిన పిల్లర్ల ప్రాంతాన్నే కాకుండా, మొత్తం 1.6 కిలోమీటర్ల పొడవైన నిర్మాణాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, మేడిగడ్డ వద్ద పరీక్షల నిమిత్తం 500 బోరు బావులు తవ్వడానికి అవసరమైన ప్రత్యేక ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలన్నారు. ఈ పనుల కోసం అవసరమైన అత్యాధునిక యంత్రాలను మరియు మానవ వనరులను తక్షణమే సమకూర్చుకోవాలని చెప్పారు. మరమ్మతులకు సంబంధించిన తుది డిజైన్లను వేగంగా ఖరారు చేసి, వచ్చే డిసెంబరు నెల వరకు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నివేదించాలని అధికారులను కోరారు.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో నిధుల కొరత అనే మాటే రానీయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పనుల పర్యవేక్షణ కోసం మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతం వద్దే ఒక ప్రత్యేక బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమైన తర్వాత తానే స్వయంగా వచ్చి పనుల పురోగతిని, నాణ్యతను పరిశీలిస్తానని అధికారులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, సాగునీటి సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటమే తమ ప్రాధాన్యతని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు నీటి పారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని, ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక , ఆర్థిక అంశాలను క్షుణ్ణంగా చర్చించారు.

Latest