Mahaa Daily Exclusive

  మృత్యువు సాక్షిగా ఓడిపోని మాతృత్వం…

Share

  • మృత్యువు సాక్షిగా ఓడిపోని మాతృత్వం.
  • నర్మదమ్మ ఒడిలో ఒక ‘అమర’ బంధం.

హైదరాబాద్, మహా.
ప్రకృతికి కన్నుంటుందో లేదో తెలియదు కానీ, కన్నతల్లి ప్రేమకు మాత్రం చావులోనూ ఓటమి లేదని ‘బార్గి’ విషాదం నిరూపించింది. నర్మదా నది తీరాన జరిగిన ‘నర్మదా క్వీన్’ నౌక ప్రమాదం ఎందరినో ప్రాణాలతో ఒడ్డుకు చేర్చింది. కానీ, ఒక తల్లిని, ఆమె పసిబిడ్డను మాత్రం ఆ జలరాశి తన గర్భంలోకి తీసేసుకుంది. అది మరణం కాదు.. ఒక అంతులేని ప్రేమకు నిశ్శబ్ద సాక్ష్యం.

**విడిపోని కౌగిలి.. వీడని నమ్మకం**

జలసమాధి అయిన ఆ రెండు భౌతిక కాయాలను బయటకు తీసినప్పుడు అక్కడ ఉన్న కఠిన హృదయులైన రెస్క్యూ సిబ్బంది కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తల్లి తన రెండు చేతులతో బిడ్డను ఎంత బలంగా హత్తుకుందంటే.. మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. ఊపిరి అందక ఊపిరితిత్తులు నీటితో నిండిపోతున్నా, లోకం అంధకారమవుతున్నా.. తన బిడ్డను మాత్రం ఆ తల్లి వదల్లేదు. ఆఖరి శ్వాస వరకు తన బిడ్డను రక్షించుకోవాలనే ఆశే ఆ తల్లికి ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది. ఇక ఆ పసివాడు.. తన అమ్మ తనను కాపాడుతుందనే అచంచలమైన నమ్మకంతో, సర్వస్వం ఆమెకే అప్పగించేసి, ఆ తల్లి కౌగిలిలోనే నిద్రపోయాడు. ఆ దృశ్యం చూస్తుంటే, మృత్యువు వారిని బలి తీసుకోలేదు.. ఆ బంధం ముందు మృత్యువే తలవంచి నిలబడింది అనిపిస్తుంది.

**లైఫ్ జాకెట్ ఓడిపోయింది.. ప్రేమ గెలిచింది!**

ఆ తల్లి లైఫ్ జాకెట్ ధరించే ఉంది. సాంకేతికంగా ఆమె నీటిపై తేలాలి, బ్రతకాలి. కానీ, ప్రాణప్రదమైన తన బిడ్డ నీటి అడుగుకు జారిపోతుంటే, లైఫ్ జాకెట్ ఇచ్చే ప్రాణభిక్ష ఆమెకు భారంగా అనిపించి ఉంటుంది. తన బిడ్డను వదిలేసి తను బ్రతకడం కన్నా, ఆ బిడ్డతో కలిసి మృత్యువునైనా ఆహ్వానించడం ఆ మాతృత్వానికి గొప్పగా అనిపించి ఉంటుంది. అందుకే ఆమె లైఫ్ జాకెట్‌ను ధిక్కరించి, తన బరువుతో పాటు బిడ్డ బరువును కూడా మోస్తూ ఆ అగాధంలోకి వెళ్లిపోయింది. ఆ జాకెట్ ఆమె శరీరాన్ని కాపాడలేకపోయింది కానీ, ఆమె మాతృత్వం ఆ బిడ్డకు ఆఖరి నిమిషం వరకు రక్షణ కవచంలా నిలిచింది.

**జీవనదాయినివా? జీవనహారిణివా?**

భారతీయ సంస్కృతిలో నదులను ‘తల్లి’ అని పిలుస్తాం. నర్మదమ్మ అని వేడుకుంటాం. కానీ, ఏ తల్లి తన బిడ్డలను తాను తింటుంది? ఏ తల్లి తన ఒడికి ఆడుకోవడానికి వచ్చిన పసికందులను ఇలా నిశితంగా ప్రాణాలు తీస్తుంది? పరాశక్తి అని కొలిచే ఆ దేవతకు నిజంగా కరుణ ఉంటే.. అమ్మ కౌగిలిలో ఆ పసిబిడ్డ ప్రాణం ఎందుకు పోయింది? ఈ ప్రశ్నలకు జవాబు లేదు. అందుకే ఆ తల్లిపై కోపం రావడం, ఆ దేవతపై అసహ్యం కలగడం అతి సహజం. ఆ దేవతకు కూడా లేని కరుణ, ఆ కన్నతల్లికి ఉంది కాబట్టే చావులోనూ బిడ్డను వదల్లేదు.

**ఆ చిరునవ్వులు.. తీరని గాయాలు**

వారు ఫోటోల్లో నవ్వుతున్న ఆ అందమైన ముఖాలు ఇక మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఆ చిరునవ్వుల వెనుక ఉన్న భవిష్యత్తును కాలం కాలరాసేసింది. జలశయం ఒడ్డున మిగిలిన ఆ నిశ్శబ్దం, ఆ తల్లి ఆఖరి ఆర్తనాదాన్ని, ఆ బిడ్డ మూగ రోదనను గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్రకృతి చేసిన ఈ అన్యాయానికి పరిహారం లేదు. ఈ విషాదం కేవలం ఒక ప్రమాదం కాదు.. ఒక మాతృత్వపు పరాకాష్ట, ఒక పసిపాప అచంచల విశ్వాసం.