Mahaa Daily Exclusive

  తమిళనాడు పీఠంపై కొనసాగుతున్న సందిగ్ధత…

Share

తమిళనాడు పీఠంపై కొనసాగుతున్న సందిగ్ధత.
* ‘మెజారిటీ చూపిస్తేనే రండి’.
* విజయ్‌కు గవర్నర్‌ స్పష్టం.
హైదరాబాద్, మహా.
తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్‌కు, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్‌భవన్ గురువారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో నెలకొన్న అనిశ్చితిపై స్పష్టతనిచ్చింది.
**లోక్‌భవన్ అధికారిక ప్రకటన**
గవర్నర్‌తో విజయ్ భేటీపై జరుగుతున్న ఊహాగానాలకు లోక్‌భవన్ విడుదల చేసిన ప్రెస్నోట్ తెరదించింది. “ఇవాళ గవర్నర్ ఆర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్పష్టంగా కనిపించడం లేదని గవర్నర్ ఆయనకు వివరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తగిన మెజార్టీ సభ్యుల మద్దతుతోనే రావాలని సూచించారు” అని లోక్‌భవన్ పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ భేటీ అవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
**రాజ్‌భవన్ వద్ద నిరసన జ్వాలలు**
మరోవైపు, తమ నాయకుడు విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ టీవీకే కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. చెన్నైలోని లోక్‌భవన్ వెలుపల గుమిగూడిన వందలాది మంది కార్యకర్తలు గవర్నర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీ సరైన వేదిక అని, రాజ్‌భవన్ కాదని వారు నినదించారు. తమ పార్టీ 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ గవర్నర్ కాలయాపన చేస్తున్నారని వారు మండిపడ్డారు. గురువారమే ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆశించిన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
**మద్దతు కోసం ముమ్మర వేట: వామపక్షాల నిర్ణయంపై ఉత్కంఠ**
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆఖరి అడుగు వేసేందుకు విజయ్ ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వామపక్షాల మద్దతు కోరుతూ టీవీకే అధినేత వారికి లేఖ రాశారు. దీనిపై సీపీఐ నాయకుడు వీరపాండియన్ స్పందిస్తూ.. విజయ్ నుంచి తమకు లేఖ అందిందని, దీనిపై చర్చించేందుకు శుక్రవారం అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ భేటీ తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో డీఎంకే నేత స్టాలిన్‌తో తన భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని ఆయన వివరించారు.
**బీజేపీపై వీసీకే ధ్వజమెత్తు**
విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తోల్ తిరుమావళవన్ కూడా గవర్నర్‌ను కలిసి టీవీకేకు మద్దతుగా నిలిచారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడమే రాజ్యాంగబద్ధమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ కావాలనే గందరగోళం సృష్టిస్తోందని, రాజకీయ అనిశ్చితికి తెరతీస్తోందని ఆయన విమర్శించారు. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై తమ పార్టీ త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తుందని తిరుమావళవన్ తెలిపారు.
**చిక్కుముడిగా మారిన అంకెలు**
ప్రస్తుత లెక్కల ప్రకారం, 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించినందున ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం 107కు చేరుతుంది. దీనికి కాంగ్రెస్‌కు ఉన్న 5 స్థానాలు కలిపితే కూటమి బలం 112 అవుతుంది. అంటే, మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 6 స్థానాల దూరంలో ఉంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతును ఎలా కూడగడతారనేదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ మరో 24 గంటల పాటు కొనసాగేలా కనిపిస్తోంది.