- అప్పుడు తెలంగాణ
- ఇప్పుడు తమిళనాడు
- బీజేపీ సింగిల్ క్లిక్‌తో అధికార పార్టీ ఔట్
- అందరినీ ఆలోచింప చేస్తున్న సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు
హైదరాబాద్, మహా : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వేళ సోషల్ మీడియాలో ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు బీజేపీ తమ రాష్ట్ర అధ్యక్షుణ్ని మారిస్తే.. ఆ రాష్ట్రంలో అధికార మార్పు జరుగుతుందనేది ఈ పోస్టు సారాంశం. ఇంతకు ముందు తెలంగాణలో, ఇప్పుడు తమిళనాడులో ఇదే జరిగిందని చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బండి సంజయ్ సారథ్యంలోని బీజేపీ దూకుడు మీద ఉంది. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు 2023 జులై 4న సంజయ్‌ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బండిని తప్పించిన తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోయింది. అప్పటి వరకూ బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించి.. రెండో స్థానంలో ఉన్నట్టు కనిపించిన కమలం పార్టీ వేగంగా కిందకు జారింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైంది. తెలంగాణలో బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
తమిళనాడులోనూ ఇదే తరహాలో బీజేపీ వ్యవహరించింది. తమిళనాట బీజేపీ పుంజుకోవడానికి శక్తికి మించి శ్రమిస్తోన్న అన్నామలైను 2026 ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్‌ను నూతన అధ్యక్షుడిగా నియమించింది. అన్నాడీఎంకేతో పొత్తు కోసమే అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. అన్నామలై విషయంలో పళనిస్వామి సౌకర్యంగా లేకపోవడం వల్లే ఈ మార్పు జరిగిందని చెబుతారు. దీనికి తగ్గట్టుగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే విజయం ఖాయమైన వేళ.. అన్నామలై వేసిన ట్వీట్‌లో పళనిస్వామి ప్రస్తావన తీసుకురాలేదు. ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. దూకుడుగా వ్యవహరిస్తూ తమిళనాడులో బీజేపీకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి నేతను ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించడం బీజేపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. తీరా చూస్తే తమిళనాడులోనూ అధికార మార్పిడి జరిగింది. డీఎంకే కూటమి అనూహ్యంగా భంగపాటుకు గురైంది. డీఎంకే ఓటమికి, బీజేపీ అధ్యక్ష మార్పుకు సంబంధం ఉందని చెప్పలేం. కానీ ఎన్నికల ముంగిట తెలంగాణతోపాటు తమిళనాడులోనూ బీజేపీ అధ్యక్షుణ్ని మార్చడం.. అధికార పార్టీలు ఇంటి ముఖం పట్టడానికి కారణమైంది.








