Mahaa Daily Exclusive

  మోహన్ నాయక్ @ రూ. 200 కోట్లు

Share

  • మోహన్ నాయక్ @ రూ. 200 కోట్లు
  • ఈ ఈఎన్ సీ అవినీతి చరిత్ర సృష్టించారు
  • ఆర్ అండ్ బీ ఈఎన్ సీ మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు
  • ఏక కాలంలో 11 చోట్ల సోదాలు
  • అక్రమాస్తులపై పక్కా ఆధారాలతో దాడులు చేసిన అధికారులు

హైదరాబాద్, మహా : అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సామ్రాజ్యాలను నిర్మించే తిమింగలాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ మరోసారి ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు చేపట్టిన ముమ్మర సోదాలు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారం, వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ బలగాలు.. మోహన్ నాయక్ నిర్మించిన అక్రమ ఆస్తుల కోటల పునాదులను కదిలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రభుత్వ అధికారి వెనకేసిన అక్రమాస్తుల విలువ ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తేలింది. నేటి కాలంలో అవినీతి అధికారులకు రూ.100 కోట్లు అనేది ఒక ఎంట్రీ లెవెల్ ప్యాకేజీ గా మారిపోయిందా అనేలా ఈ దాడుల సరళి సాగింది. హైదరాబాద్ మాధాపూర్‌లోని ఆయన ప్రధాన నివాసంతో పాటు, మియాపూర్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్ జిల్లా సహా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11 విభిన్న ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. మోహన్ నాయక్‌కు సంబంధించిన కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలోనూ తనిఖీలు ముమ్మరంగా సాగాయి.

ఈ సోదాల్లో లభించిన అవినీతి సంపదను చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోయారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రతి ఏసీబీ దాడిలోనూ సాధారణంగా కనిపించే భారీ నగదు, కిలోల కొద్దీ బంగారం, విలాసవంతమైన ఫార్మ్‌హౌస్‌లు, విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, సీక్రెట్ లాకర్ల పర్వం ఇక్కడా పునరావృతమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు రూ.65 లక్షల నగదు, 2.5 కేజీల బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, బినామీల పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ బ్యాంకు ఖాతాల వివరాలు, లాకర్ల కీలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని అనుమానాస్పద డైరీలు, సేల్ డీడ్లను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

రోడ్లు, భవనాల శాఖలో అత్యంత ఉన్నత పొజిషన్‌లో ఉన్న మోహన్ నాయక్‌పై గత కొంతకాలంగా కాంట్రాక్టర్ల నుండి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే రహదారుల నిర్మాణం, ప్రభుత్వ భవనాల టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, కొన్ని నిర్దిష్ట ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయన ఈ అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల అప్రూవల్స్, కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్లలో ఆయనకున్న అపరిమితమైన అధికారమే ఈ స్థాయి అవినీతికి మార్గం సుగమం చేసిందని దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేసి ఆస్తులు కూడబెట్టడం వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. పట్టుబడిన ఆస్తుల లెక్కలు, ల్యాండ్ డాక్యుమెంట్ల విలువలు మార్కెట్ రేటు ప్రకారం చూస్తే వందల కోట్లలోనే తేలే అవకాశం ఉండటంతో.. పూర్తి వివరాలను క్రోడీకరించి, సమగ్ర నివేదికను రూపొందించడానికి మరింత సమయం పడుతుందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.