- అక్కకు విడాకులిచ్చి చెల్లిని పెళ్లాడాడు
- భార్యపై అనుమానంతో తుపాకీతో కాల్చి చంపిన భర్త
- మల్కాజిగిరి పోలీసుస్టేషన్ పరిధిలో ఘటన
మల్కాజిగిరి, మహా : అనుమానమే పెను భూతమై హైదరాబాద్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గత కొంతకాలంగా ఆమెతో నిత్యం గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే వారి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఆమెను గన్‌తో కాల్చి హతమార్చాడు. ఆపై అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇరుగు పొరుగు వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. అయితే ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందు.. ఆమె అక్కను పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నట్లు తేలింది.
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడికి, ఆమె భార్య నిషారాణికి మధ్య తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తిని తీసుకుని ఆమె ఇంటికి తెల్లవారుజామున వచ్చిన అరుణ్ కుమార్ మాట్లాడుతుండగానే గొడవ ప్రారంభమైంది. తన వెంట తెచ్చుకున్న తుపాకీ తీసిన అరుణ్ కుమార్.. తన భార్య నిషారాణిపై 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తుపాకీ కాల్పులతో నిషారాణి తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. తుపాకీ కాల్పుల శబ్దం విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని నిషారాణి మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్ కుమార్ ఆ తర్వాత ఆమె చెల్లెలిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు గుర్తించారు.
కొన్ని నెలల క్రితం అంబర్‌పేటలో వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు అక్రమంగా తుపాకీ కలిగి ఉండి అరుణ్ కుమార్ ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడి తుపాకీని సీజ్ చేయడంతో పాటు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన అరుణ్ కుమార్ తర్వాత బయటికి వచ్చాడు. ఆ తర్వాత పాతబస్తీకి చెందిన ఫ్రెండ్స్ ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసిన అరుణ్ కుమార్ తన భార్యపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.








