Mahaa Daily Exclusive

  అసెంబ్లీని ఎందుకు ర‌ద్దు చేయాలి…

Share

  • అసెంబ్లీని ఎందుకు ర‌ద్దు చేయాలి
  • ప్రజలు ఐదేళ్ళకు తీర్పునిచ్చారు
  • ప్ర‌తి ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు శిక్ష వేస్తూనే ఉన్నారు
  • బిజేపీది ఆశ‌కాదు.. అత్యాశ‌
  • రైతు భ‌రోసా నిధులు వారంరోజుల్లో జ‌మ‌చేస్తాం
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైద‌రాబాద్‌, మహా : బిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయ‌న‌కు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింద‌నే అనుమానం క‌లుగుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అన్నారు. సోమ‌వారం స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మంత్రి మాట్లాడుతూ ద‌మ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌న్న‌ హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ తెలంగాణ ప్ర‌జలు మాకు ఐదేళ్ల‌కు అధికార‌మిచ్చారు, రెండున్న‌రేళ్ల‌కే ఎందుకు అసెంబ్లీని ర‌ద్దు చేస్తామన్నారు. ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది, గ‌డ‌చిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌ల తీర్పు ఏవిధంగా ఉందో హ‌రీష్‌రావుకు తెలుసన్నారు. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే తీర్పు ఏముంది? రెండుకాళ్లు లేనివాడు చూసుకుందాం రా.. అని స‌వాలు విసిరిన‌ట్లే బిఆర్ఎస్ నాయ‌కుల స‌వాళ్లు ఉంటున్నాయన్నారు.

ఈ ప్ర‌భుత్వం చేసే మంచిప‌నుల‌ను జీర్ణించుకోలేక భ‌విష్య‌త్తులో అధికారం ద‌క్క‌ద‌నే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. నా నియోజ‌క‌వ‌ర్గం పాలేరులో కేటీఆర్ విమ‌ర్శ‌లు ఇదే కోవ‌లోకి వ‌స్తాయని, బిఆర్ఎస్ నాయ‌కులు చేసే చిల్ల‌ర విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిసారీ స్పందించనని అన్నారు. ఎప్పుడో ఒక‌సారి క‌చ్చితంగా క‌ర్ర కాల్చి వాత పెడ‌తా. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలిన‌ట్టుకాదు. ప్ర‌జ‌లు ఛీ కొట్టినా బాంబులు ప‌డ్డ‌ట్టే. ఏ వ్య‌క్తిమీదా వ్య‌క్తిగ‌త క‌క్ష‌పూరిత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ఆలోచ‌న ఈ ప్ర‌భుత్వానికి లేదు. త‌ప్పుచేసిన వాళ్ళ‌ను జైలులో వేస్తేనే శిక్షించిన‌ట్లు కాదు. ప్ర‌తి ఎన్నిక‌ల్లో వాళ్ల‌ను ఓడించి ప్ర‌జ‌లు శిక్షిస్తూనే ఉన్నారు. త‌మిళ‌నాడు లాంటి ప‌రిస్ధితి ఈ రాష్ట్రంలో తీసుకురామన్నారు.

అధికారంలోకి వ‌స్తామ‌ని బిజేపీ ప‌గ‌టిక‌ల‌లు కంటోందని, ఆశ ఉండ‌డంలో త‌ప్పులేదు కానీ ఆ పార్టీ అత్యాశ‌కు పోతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ రాని పార్టీ అధికారం గురించి ఆశ ప‌డుతోందని ఎద్దేవా చేశారు. బిజేపీ, బిఆర్ఎస్ ఒకే తాను ముక్కలని, కాళేశ్వ‌రం అవినీతి, ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ అక్ర‌మాల‌పై సిబిఐ విచార‌ణ చేయాల‌ని అడిగితే బిజేపీ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదన్నారు. ఈ సారి రైతు భ‌రోసా నిధుల‌ను అనుకున్న‌దానికంటే రెండు మూడు రోజుల ముందే వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో జ‌మ‌చేస్తామన్నారు. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల కోసం ఇప్ప‌టివ‌ర‌కు 18 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 23 స్ధ‌లాల‌ను గుర్తించ‌డం జ‌రిగిందని, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేసే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేదన్నారు. భూముల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌లు ఎక్క‌డైనా పొర‌పాటుగా ఎక్కువ ధ‌ర నిర్ణ‌యిస్తే స‌రిచేయ‌డానికి సిద్దంగా ఉన్నామన్నారు. తాండూరులో ఇదే విధంగా జ‌రిగితే స‌రిదిద్ద‌డం జ‌రిగిందన్నారు.