Mahaa Daily Exclusive

  అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బ…..

Share

అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బ.
* ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామా!
* తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం.
* కొత్త పార్టీ వైపు మాజీ మంత్రి చూపు.
చెన్నై, మహా .
తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ద్రవిడ రాజకీయాల్లో తిరుగులేని శక్తులుగా వెలిగిన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ కొత్త శకం వైపు పరిణామాలు దూసుకుపోతున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తన శాసనసభ్యత్వానికి సంచలన రాజీనామా చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది కాలంలోనే ఏఐఏడీఎంకేను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఆయనతో కలిపి ఆరుకు చేరడం ఆ పార్టీని తీవ్ర ఆందోళనలో పడేసింది.

**స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా.. తగ్గిన అన్నాడీఎంకే బలం**
మాజీ మంత్రి విజయభాస్కర్ సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుని, అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ అధికారిక పత్రాన్ని సమర్పించారు. రాజీనామా లేఖను, అసెంబ్లీ నిబంధనలను కూలంకషంగా పరిశీలించిన స్పీకర్, ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు సచివాలయ వర్గాలు ధృవీకరించాయి. విజయభాస్కర్ నిష్క్రమణతో తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీ అధికారిక బలం 41 స్థానాలకు పడిపోయింది.

**’టీవీకే’ వైపు ప్రజాప్రతినిధుల క్యూ**
కేవలం రెండు వారాల క్రితమే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేసి, తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సరికొత్త రాజకీయ శక్తి ‘టీవీకే’ (తమిళగ వెట్రి కళగం) పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయభాస్కర్ సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన కూడా త్వరలోనే అధికారికంగా టీవీకే పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత కేబినెట్ లో అత్యంత కీలకమైన రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విజయభాస్కర్, 2021 ఎన్నికల్లో కరూర్ నుంచి ఓడిపోయినప్పటికీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించారు. అలాంటి సీనియర్ నేత పార్టీని వీడటం అన్నాడీఎంకేకు పెద్ద లోటని విశ్లేషకులు భావిస్తున్నారు.

**రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారాకు ఆస్కారం**
విజయభాస్కర్ రాజీనామాతో కలిపి తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇందులో ప్రముఖంగా తిరుచ్చి స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. వరుస రాజీనామాల పరంపరతో ఖాళీ అయిన ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాబోయే రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలు తమిళనాడులోని ప్రధాన ద్రవిడ పార్టీలతో పాటు పుంజుకుంటున్న సరికొత్త శక్తులకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.