- సీఎస్ గా కొలువుదీరిన సంజయ్ జాజు
- అంతకు ముందు సీఎం రేవంత్ తో ములాఖత్
- పదవీ విరమణ చేసిన రామకృష్ణారావు
- ఇరువురినీ అభినందిన స్పెషల్ సీఎస్ లు, పలువురు ఉన్నతాధికారులు
హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు. పదవీ బాధ్యతలను స్వీకరించేకంటే ముందు సంజయ్ జాజు హెచ్ ఆర్ డీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హెచ్ఆర్ డీ నుంచి నేరుగా సచివాలయానికి వచ్చిన జాజు సీఎస్ గా బాధ్యతలను స్వీకరించారు.








