Mahaa Daily Exclusive

  నేటి నుంచే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్‌డౌన్ స్టార్ట్….

Share

  • నేటి నుంచే
  • తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్‌డౌన్ స్టార్ట్
  • బిజెపి నాయకత్వానికి తెలంగాణ ప్రత్యేక మిషన్
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
  • రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక ప్రసంగం చేసిన జాతీయ అధ్యక్షుడు
  • బీఆర్ఎస్ కాళేశ్వరంతో అవినీతికి పాల్పడితే, కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన పేరుతో వెళ్తొంది
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి
  • ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ

హైదరాబాద్, మహా : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్‌డౌన్ నేటి నుంచే ప్రారంభమైందని బిజెపి అధ్యక్షులు నితిన్ నబిన్ ప్రకటించారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో చివరగా ఘటకేశ్వర్ వద్ద పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణను ప్రత్యేక మిషన్‌గా స్వీకరించిందని ప్రకటించారు.
“మన పోరాట దిశను మేము ఇప్పటికే నిర్ణయించుకున్నాం. వీధి నుంచి శాసనసభ వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ప్రభుత్వ కౌంట్‌డౌన్ నేటి నుంచే ప్రారంభమైందని నేను విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు, ప్రతి నిర్ణయానికి, ప్రతి అవినీతి వ్యవహారానికి బిజెపి కార్యకర్తలు ప్రజల తరఫున పూర్తి లెక్క అడుగుతారు. అందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.
గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా తాను చూసిన దృశ్యాలు, కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహం, ప్రజల్లో నెలకొన్న విశ్వాసం రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోందని, రానున్న కాలం తెలంగాణలో బీజేపీదే అనే విశ్వాసం మరింత బలపడిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించాలనే సంకల్పాన్ని ఈ కార్యవర్గ సమావేశం ద్వారా మనమంతా చేయాలని ఆయన పిలుపిచ్చారు.

నేడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల రాజకీయాన్ని నడుపుతోందని చెబుతూ ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి బూత్ స్థాయికి వెళ్లి ఆ అబద్ధాలను ప్రజల ముందు బట్టబయలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 35 శాతం ఓట్లను సాధించి బిజెపి తన బలమైన ఉనికిని నమోదు చేసిందని చెబుతూ ఇది తెలంగాణ ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ప్రజాసమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి వ్యతిరేకంగా మనమంతా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపిచ్చారు. తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలవాలంటే వారి సమస్యలతో మమేకం కావాలని, ప్రజల సమస్యలపై పూర్తి శక్తితో ఉద్యమించాలని ఆయన సూచించారు.
పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఐక్యంగా, అంకితభావంతో పోరాటం చేస్తే 2028లో తెలంగాణలో విజయం బిజెపిదే కాగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే మన ఎన్నికల అజెండాగా చేసుకోమని, గత 12 సంవత్సరాల్లో మా ప్రభుత్వం దేశంలో తీసుకొచ్చిన అభివృద్ధి, మార్పు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలనే ప్రజల ముందుకు తీసుకెళ్తామని పేర్కొంటూ మన పనితీరే మన అజెండా అని తెలిపారు. దేశంలో ఏయే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో అక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక, నిద్రాణ ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో గద్దెదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ప్రకటించిన ఆర్థిక సహాయం అందించారా? అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం కన్నా ఢిల్లీ దర్బార్‌ను సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించి ఢిల్లీలో తమ రాజకీయాలను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజంగా తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే ప్రజలకు చేరేవని చెప్పారు. “నేడు గ్యారంటీల పోస్టర్లు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఆ గ్యారంటీల ప్రయోజనాలు మాత్రం ప్రజలకు అందలేదు. ఈ వాస్తవాన్ని ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని తెలిపారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన ఒక్క రూపాయి కూడా అక్రమ వసూళ్లకు బలికాకూడదని చెబుతూ ప్రజలను దోచుకునే ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో గద్దె దించేందుకు బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, కుటుంబ పాలనను దాటి ముందుకు వెళ్లలేకపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణంగా నిలిచిందని నితిన్ నబిన్ విమర్శించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని పేర్కొంటూ అవినీతి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి అనే స్థాయికి ఆ పార్టీ చేరుకుందని ధ్వజమెత్తారు.

నేడు రాజకీయాల నేరీకరణకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతీకగా మారుతోందని చెబుతూ దేశ వ్యతిరేక శక్తులకు, దేశాన్ని విభజించే ఆలోచనలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెడుతోందని మండిపడ్డారు. అందుకే అవినీతి, రాజకీయాల నేరీకరణ అనే రెండు మచ్చలతో కాంగ్రెస్ గుర్తింపు పొందుతోందని చెప్పారు.
ఇటీవల ముసీ రివర్‌ఫ్రంట్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన పాత అవినీతి సంప్రదాయాన్నే కొనసాగిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. ప్రజా ధనాన్ని దోచుకునే మరో అవకాశంగా దానిని మలుస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టార్జిత ధనాన్ని ప్రజల సంక్షేమానికి కాకుండా ఇతర రాజకీయ అవసరాలకు వినియోగిస్తే బిజెపి కార్యకర్తలు ప్రతి రూపాయికి లెక్క అడుగుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కూడా ఆ జవాబుదారీతనాన్ని తప్పకుండా కోరుతారని స్పష్టం చేశారు. తెలంగాణలో మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ కుమ్మక్కు కొనసాగుతోందని ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ఏ ప్రయత్నాన్నైనా బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ ప్రయోజనాలను ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. సమాజంలో ఇంకా అభివృద్ధి ఫలాలు పూర్తిగా అందని వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే బిజెపి లక్ష్యం అని ప్రకటించారు.

తెలంగాణలో హిందూ దేవాలయాలు, దేవతల పట్ల అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయని నితిన్ నబిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి ఆలయంపై జరిగిన దాడి వంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీస్తామని స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని భరోసా వ్యక్తం చేశారు.
కుటుంబ పాలన, అవినీతి, హామీల అమలులో వైఫల్యం వంటి రాజకీయాలకు ముగింపు పలకాలంటే మనమంతా మరింత శక్తివంతంగా పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల రాజకీయాల్లో ఉమ్మడి లక్షణాలు మూడు అవినీతి, కుటుంబ పాలన, హామీల అమలులో వైఫల్యం అని విమర్శించారు. అదే సమయంలో వారి రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాలపై ఆధారపడితే బిజెపి రాజకీయాలు ప్రతి పౌరుడిని సంతృప్తిపరిచే సమగ్ర అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.