Mahaa Daily Exclusive

  పాకిస్థాన్‌కు పీఓకే నేతల అల్టిమేటం….

Share

పాకిస్థాన్‌కు పీఓకే నేతల అల్టిమేటం.
* అవసరమైతే భారత్ సాయం కోరుతామని హెచ్చరిక.
* ఇస్లామాబాద్ నియంతృత్వ పాలనపై మిన్నంటిన నిరసనలు.
* 22వ రోజుకు చేరిన ఆందోళనలు.
* భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.
ఢిల్లీ, మహా.
ఇస్లామాబాద్ నియంతృత్వ వైఖరికి, కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. పాక్ పాలకుల అణచివేత ధోరణిపై పీఓకే నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇస్లామాబాద్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పీఓకే ఇకపై ఎంతమాత్రం పాకిస్థాన్ నియంత్రణలో ఉండబోదని, తమకు పాక్‌తో అసలు అవసరమే లేదని తేల్చిచెప్పారు. రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ నిరసన ప్రదర్శనలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతలు మాట్లాడుతూ.. పీఓకే ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. తమకు కనీస ఆహార సరఫరాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తే, పొరుగునే ఉన్న భారతదేశం సాయం తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని సంచలన ప్రకటన చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నియంతలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు.
**రాజకీయ వివక్ష, విద్యుత్ దోపిడీయే కారణం!**
పీఓకే అసెంబ్లీ ఎన్నికల్లో కాశ్మీరీ శరణార్థుల పేరిట మొత్తం స్థానాల్లో 12 సీట్లను పాకిస్థాన్ ప్రభుత్వం కేటాయించడం ఈ తాజా వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ శరణార్థులంతా పీఓకేలో కాకుండా పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ వంటి నగరాల్లో నివసిస్తుండటంతో, వారి కోసం ఇక్కడ సీట్లు కేటాయించడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ 12 స్థానాల రిజర్వేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు పీఓకే ప్రజలను అధిక కరెంట్ బిల్లులు, గంటల తరబడి విద్యుత్ కోతలు అతలాకుతలం చేస్తున్నాయి. పాకిస్థాన్ దేశవ్యాప్త అవసరాలకు కీలకమైన అత్యధిక జలవిద్యుత్ పీఓకేలోని ‘మంగ్లా డ్యామ్’ ద్వారానే ఉత్పత్తి అవుతున్నప్పటికీ.. స్థానిక ప్రజల నుంచి మాత్రం పాక్ ప్రభుత్వం భారీగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతోంది.
మరోవైపు పాకిస్థాన్ అనుభవిస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రభావం పీఓకేపై తీవ్రంగా పడింది. అక్కడ గోధుమ పిండి, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పేదలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సైతం ఎత్తివేయడంతో సామాన్యులు ఆకలితో అలమటించే పరిస్థితి దాపురించింది. బియ్యం, విద్యుత్, గోధుమ పిండి ధరలను తక్షణమే తగ్గించాలని, తమ ప్రాథమిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు శాంతియుత మార్గంలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పాక్ పాలకుల వివక్షపై పీఓకేలో రేగిన ఈ తిరుగుబాటు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.