Mahaa Daily Exclusive

  రైతు భరోసా నిధులు విడుదల…..

Share

రైతు భరోసా నిధులు విడుదల.
* తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు జమ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. తొలి విడత కింద రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను నేరుగా (డీబీటీ ద్వారా) జమ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గత పాలనలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని మళ్లీ గాడిన పెడుతున్నామని, 30 నెలల ప్రజాపాలనలో రైతు సమాజం గర్వంగా తలెత్తుకునేలా పారదర్శక పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఒకప్పుడు కొందరు వ్యవసాయం దండగ అన్నారని, కానీ తమ ప్రభుత్వం దానిని పండుగగా మార్చేలా ప్రతి అడుగూ వేస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక విధ్వంసంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి కేవలం రూ.69 వేల కోట్ల అప్పు ఉండగా, 2023 నాటికి కేసీఆర్ ప్రభుత్వం దానిని ఏకంగా రూ.8.11 లక్షల కోట్లకు చేర్చిందని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేసి, దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు, తప్పుల భారాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బకాయిలు పెట్టింది బకాసురుడు… కట్టే పాపం మాకా?’ అంటూ గత పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాయిదాల పద్ధతిలో జీతాలు చెల్లించే దుస్థితి తెచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పరువును ఢిల్లీ నుంచి గల్లీ వరకు తీశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తూ వ్యవస్థను సక్రమ మార్గంలో పెట్టామన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.36 వేల కోట్లను రైతులకు అందించినట్లు సీఎం స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిపివేస్తారంటూ గతంలో కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేశారని, కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా 2004లో రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.30 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.4 వేల కోట్లు, అదేవిధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం కోసం రూ.80 వేల కోట్లను భారీగా వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు.