Mahaa Daily Exclusive

  కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట…..

Share

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట.
* నాంపల్లి కోర్టులో కేసు కొట్టివేత.
*హుజూరాబాద్ ఉప ఎన్నికల నాటి కేసులో న్యాయస్థానం కీలక తీర్పు.
* బీఆర్‌ఎస్‌పై ఓట్ల కొనుగోలు ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసు.
హైదరాబాద్, మహా.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో నమోదైన ఓ పాత కేసులో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌కు పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసును సుదీర్ఘంగా విచారించిన హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. బండి సంజయ్‌పై ఉన్న కేసును కొట్టివేస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా సాగుతున్న ఈ న్యాయపరమైన వివాదానికి తెరపడినట్లయింది.
గతంలో ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో.. అప్పటి అధికారపక్షమైన బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఓటుకు ఏకంగా రూ.25 వేల వరకు పంపిణీ చేస్తోందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. అందులో భాగంగా ఓటర్లకు కేవలం రూ.5 వేల చొప్పున మాత్రమే చేరవేసి, మిగిలిన భారీ మొత్తాన్ని ఆ పార్టీ కార్యకర్తలే సొంతంగా పంచుకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
బండి సంజయ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలను అప్పట్లో తీవ్రంగా పరిగణించిన హుజూరాబాద్ పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188 (ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన), 171సీ (ఎన్నికల్లో అక్రమ ప్రభావం చూపడం), 505(2) (విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123(3ఏ) కింద ఆయనపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఈ ఆరోపణలపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. బండి సంజయ్‌పై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.