Mahaa Daily Exclusive

  ఇథనాల్ బ్లెండింగ్‌పై ‘సుప్రీం’లో విచారణ…..

Share

ఇథనాల్ బ్లెండింగ్‌పై ‘సుప్రీం’లో విచారణ.
* యథాతథస్థితికి ఆదేశం.
*వేర్వేరు తీర్పులొస్తే కేంద్రం ఆశయానికి ఆటంకం: అటార్నీ జనరల్ వెంకటరమణి.
* వివిధ హైకోర్టుల్లోని కేసులను ఒకే చోటికి బదిలీ చేయాలని విజ్ఞప్తి.
ఢిల్లీ, మహా.
పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ (మిశ్రమం) ప్రక్రియ, కేటాయింపుల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. 2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపులపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ జరిగేంత వరకు ప్రస్తుత వివాదంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణ సందర్భంగా బీపీసీఎల్ తరఫున కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ధర్మాసనం ముందు బలమైన వాదనలు వినిపించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రతే ధ్యేయంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. ఈ అద్భుతమైన ప్రక్రియకు సంబంధించిన విప్లవాత్మక ఫలితాలు వచ్చే ఏడాది కల్లా దేశవ్యాప్తంగా స్పష్టంగా గోచరిస్తాయని న్యాయస్థానానికి వివరించారు. అయితే, సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు మొదట కర్ణాటక హైకోర్టుకు చెందిన డివిజన్ బెంచ్‌ను ఎందుకు సంప్రదించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కోర్టు ప్రశ్నకు అటార్నీ జనరల్ బదులిస్తూ.. గతేడాది అక్టోబర్ 2025 నాటికే ఇథనాల్ సరఫరాకు సంబంధించిన అన్ని ఒప్పందాలు ముగిసిపోయాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఈ లీగల్ ప్రక్రియను మొదటికి తీసుకువస్తే, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇథనాల్ కేటాయింపులపై ఇలాంటి వివాదాలు పలు రాష్ట్రాల హైకోర్టుల్లో నడుస్తున్నాయని, దీనివల్ల వేర్వేరు కోర్టులు పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చే ప్రమాదం ఉందని అటార్నీ జనరల్ వివరించారు. అందువల్ల ఈ కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకే బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం విజ్ఞప్తిని ప్రైవేట్ కంపెనీల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కేసు విచారణను ఆలస్యం చేయడానికే కేంద్రం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలను రికార్డు చేసుకున్న సుప్రీంకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు స్టేటస్ కో విధిస్తూ విచారణను వాయిదా వేసింది.