Mahaa Daily Exclusive

  జులై 2 న రాష్ట్ర కేబినెట్ భేటీ…

Share

జులై 2 న రాష్ట్ర కేబినెట్ భేటీ.
* అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
* కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో సందడి మొదలైంది. రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. జులై 2వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక మంత్రిమండలి సమావేశం జరగబోతోంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ హాల్ వేదికగా జరగనున్న ఈ 34వ మంత్రిమండలి సమావేశానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
**అజెండా రూపకల్పనలో అధికారుల నిమగ్నం**
కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించిన కీలక అంశాలతో అజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అజెండా ప్రతిపాదనలను విధిగా తెలుగు అనువాదంతో సహా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపాలని సీఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఏదైనా శాఖలో చర్చించడానికి ఎలాంటి అజెండా అంశాలు లేకపోతే.. నిర్దేశించిన సమయానికి కనీసం ‘నిల్’ రిపోర్టునైనా సరే తప్పనిసరిగా సమర్పించాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
**కార్యాలయాల్లోనే ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు**
మంత్రిమండలి సమావేశం జరిగే సమయంలో ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగానే పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేబినెట్ భేటీ ముగిసేంత వరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్యదర్శులందరూ కచ్చితంగా తమ తమ కార్యాలయాల్లోనే విధుల్లో అందుబాటులో ఉండాలని సీఎస్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. మంత్రులకు ఏవైనా తక్షణ వివరాలు అవసరమైతే వెంటనే అందించేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
**ముమ్మరంగా ముందస్తు ఏర్పాట్లు**
ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు వివిధ విభాగాల అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ప్రొటోకాల్ డైరెక్టర్, హార్టికల్చర్ డైరెక్టర్, ట్రాన్స్‌లేషన్స్ డైరెక్టర్లతో పాటు టీజీటీఎస్ యూనిట్ మేనేజర్లు సమన్వయంతో పనిచేసి, సమావేశానికి అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసింది.