Mahaa Daily Exclusive

  తెలంగాణలో కోటీ 14 లక్షల కుటుంబాలు…

Share

తెలంగాణలో కోటీ 14 లక్షల కుటుంబాలు.
*కేంద్ర జనగణన ప్రాథమిక అంచనాల్లో వెల్లడి.
* అధికారిక ప్రకటనకు సమయం.
*గ్రేటర్ హైదరాబాద్‌లోనే 36 లక్షల ఇళ్లు.
* గోవా మొత్తం జనాభా కంటే అధికం.
* వచ్చే నెలలో తిప్పర్తి, పినపాక, రామచంద్రపురంలో పైలట్ ప్రాజెక్టుగా రెండో దశ సర్వే.
హైదరాబాద్, మహా.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాజా జనగణన (సెన్సస్) తొలి దశ అంచనాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య సుమారు కోటీ 14 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. 2027 ఆఖరు నాటికి ఈ జనాభా లెక్కలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పాత సర్వేలతోను, రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా నిర్వహించిన సర్వేలతోను పోల్చి చూస్తే.. తాజా కేంద్ర లెక్కల్లో కుటుంబాల సంఖ్య చాలా అధికంగా నమోదైనట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 36 లక్షల కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. ఈ సంఖ్య గోవా రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.
**ఆరు నెలల క్రితం నాటి రాష్ట్ర సర్వే లెక్కలకు.. వీటికి భారీ తేడా!**
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఆరు నెలల క్రితమే క్షేత్రస్థాయిలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిర్వహించింది. ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర మొత్తం జనాభా 3.55 కోట్లుగా తేలింది. ఆ సమయంలో దాదాపు 3 శాతం మంది ప్రజలు వివిధ కారణాల వల్ల సర్వేకు సహకరించలేదని, వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర జనాభా గరిష్ఠంగా 3.65 కోట్ల లోపే ఉంటుందని అప్పట్లో ప్రభుత్వం భావించింది. కానీ, కేంద్రం చేపట్టిన తాజా జనగణన ప్రాథమిక సర్వే అంచనాల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభా ఏకంగా 4.35 కోట్లు దాటినట్లు తెలుస్తుండటం గమనార్హం.
**తెలంగాణలో తొలిసారిగా అధికారిక జనగణన**
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ జనాభా లెక్కలను సేకరించడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా వ్యక్తిగత వివరాలను సేకరించే రెండో దశ ప్రక్రియను వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు. అయితే, ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా మరింత పారదర్శకంగా నమోదు చేసేందుకు వీలుగా వచ్చే నెలలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) సర్వే చేపట్టనున్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లాలోని తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాకతో పాటు హైదరాబాద్ శివారులోని రామచంద్రపురం పరిధిలో ఈ పైలట్ సర్వే జరగనుంది. ఈ ప్రయోగాత్మక పరిశీలనలో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనాపరమైన లోటుపాట్లను సరిదిద్దుకుని, 2027 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం సర్వే నిర్వహిస్తారు. ఈ మేరకు మూడు రోజుల క్రితమే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా, జనాభా లెక్కల్లో భాగంగా ఇప్పటికే మొదటి దశ కింద ఇళ్లు, భవనాలు, ఇతర కట్టడాలు మరియు కుటుంబాల గుర్తింపు ప్రక్రియను ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు విజయవంతంగా పూర్తి చేశారు.
**2010-11 లెక్కలతో పోల్చితే పెరిగిన జనాభా**
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో 2010-11లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జనాభా లెక్కలను సేకరించింది. ఆనాటి లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో మొత్తం జనాభా 3.50 కోట్లుగా ఉండగా, కుటుంబాల సంఖ్య 83.03 లక్షలుగా తేలింది. నాటితో పోల్చితే ప్రస్తుతం అదనంగా 85 లక్షల జనాభా, అలాగే సుమారు 31 లక్షల కుటుంబాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. గతంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లెక్కలు ప్రకటించినప్పుడు 12.35 లక్షల కుటుంబాలతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండేది. కానీ ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త సరిహద్దుల ప్రకారం లెక్కించడంతో, ఇప్పుడు జిల్లాల వారీగా ఉమ్మడి నల్గొండ జిల్లా 10.43 లక్షల కుటుంబాలతో ప్రథమ స్థానంలో నిలిచింది.
**నగరాల వారీగా.. 36 లక్షల కుటుంబాలతో హైదరాబాద్ టాప్**
ఈసారి కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ల (నగరపాలక సంస్థల) సరిహద్దుల ప్రకారం పట్టణ ప్రాంతాల జనాభాను విడివిడిగా లెక్కిస్తోంది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా మంచిర్యాల పట్టణంలో కేవలం 60 వేల కుటుంబాలు ఉన్నట్లు తేలింది. అలాగే పరిశ్రమల కేంద్రమైన రామగుండంలో 63 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక నగరాల జాబితాలో ఎప్పటిలాగే 36 లక్షల కుటుంబాలతో రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరంగల్ నగరం 2.55 లక్షల కుటుంబాలతోను, కరీంనగర్ 1.18 లక్షల కుటుంబాలతోను ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1.06 లక్షలుగా నమోదు కాగా.. ఖమ్మం నగర పరిధిలో ఒక లక్ష కుటుంబాలు, మహబూబ్‌నగర్‌లో 63 వేల కుటుంబాలు ఉన్నట్లు తాజా ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తోంది.