Mahaa Daily Exclusive

  నేను బటన్ నొక్కే వ్యక్తిని కాదు…..

Share

నేను బటన్ నొక్కే వ్యక్తిని కాదు.
* ప్రజల్లో ఉండే వ్యక్తిని.
* అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యం.
* రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం: సీఎం చంద్రబాబు.
నెల్లూరు,మహా.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాను కేవలం బటన్ నొక్కి పథకాలు ప్రకటించే నాయకుడిని కాదని, నేరుగా ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ పాలన సాగించే వ్యక్తినని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడిన ఆయన సంక్షేమ పథకాల అమలు నుంచి పారిశ్రామికాభివృద్ధి వరకు, నీటి నిర్వహణ నుంచి రాజధాని నిర్మాణం వరకు, రాజకీయ విమర్శల నుంచి రాష్ట్ర భవిష్యత్తు దిశ వరకు అనేక కీలక అంశాలపై తన ప్రభుత్వ వైఖరిని వివరించారు.

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62.20 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.33 వేల కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. మొత్తం 28 రకాల కేటగిరీల కింద అర్హులైన వారికి పెన్షన్లు అందుతున్నాయని, ఒక నెలలో పెన్షన్ తీసుకోలేకపోయినా మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

తాను బటన్ నొక్కి కార్యక్రమాలు ముగించే నాయకుడిని కాదని, ప్రజల మధ్య ఉండి వారి సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు చూపే వ్యక్తినని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ పాలన సాగించడమే తన నమ్మకమని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమానంగా కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి కృషి
రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి భుజాన వేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ సుపరిపాలనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘మనమిత్ర’ అనువర్తనం ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం అన్ని శాఖలను సమర్థవంతంగా గాడిలో పెడుతున్నామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తోందని చెప్పారు.
నెల్లూరు జిల్లాను దేశంలోనే నంబర్-1 జిల్లాగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. జిల్లాకు 27 భారీ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. గూడూరులో దేశంలోనే అతిపెద్ద ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు కానుందని వెల్లడించారు. దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
నీటి సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారం
రాష్ట్ర భవిష్యత్తు కోసం నదుల అనుసంధానం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడం కూటమి ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజా రవాణాలో పూర్తిస్థాయిలో ఎయిర్ కండిషన్డ్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పీ-4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌కే ప్రాజెక్టులకు నీటి ప్రవాహం ప్రారంభమైందని, కానీ ఈసారి జూలై వచ్చినా పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. వర్షాభావం కారణంగా కృష్ణా, గోదావరి నదుల నుంచి కూడా తగిన నీరు అందే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి నిర్వహణలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు.

ప్రపంచ పరిస్థితుల ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యుద్ధాలు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రజలు తెలివిగా వ్యవహరించాలని సూచించారు. దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా, మనం దేశానికి ఏమిచ్చామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కోసమే తన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఒక ‘గొడ్డలి పార్టీ’ ఉందంటూ ప్రతిపక్షంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిరోజూ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అందరూ మద్దతు తెలిపినా, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని అన్నారు. రాజధానిని వ్యతిరేకించినందుకే ప్రజలు గత ఎన్నికల్లో తీవ్రంగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
రాజధాని రైతులపై దాడులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ రౌడీయిజాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చంద్రబాబు హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సాయికృష్ణ కేసు పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా లాగేందుకు ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీలు, గూండాలకు ప్రతిపక్షం అండగా నిలుస్తోందని విమర్శించారు. హోం మంత్రిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, ఆడబిడ్డల జోలికి వస్తే చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు.