Mahaa Daily Exclusive

  భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ…

Share

భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.
* బాధితురాలికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.
* రెగ్యులర్ బెయిల్‌పై నిర్ణయం ఎల్లుండికి వాయిదా.
* పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా భగీరథ్.
* బాధితురాలి వాదన తర్వాతే బెయిల్‌పై నిర్ణయం.
హైదరాబాద్, మహా.

పోక్సో చట్టం కింద నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. బెయిల్‌పై నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి వాదన కూడా వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్న న్యాయస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేయడంతో బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
తనపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపితమైందని, ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని బండి భగీరథ్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి అభిప్రాయం కూడా వినాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బండి భగీరథ్‌పై మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన అనంతరం కొంతకాలం పరారీలో ఉన్న ఆయనను మే 16న పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు కోర్టు భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియడంతో గత వారం ఆయన తిరిగి చర్లపల్లి జైలులో లొంగిపోయారు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
బాధితురాలి కౌంటర్ దాఖలు అనంతరం హైకోర్టు ఎల్లుండి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై న్యాయవర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.