Mahaa Daily Exclusive

  ఆదాయ లీకేజీలకు అడ్డుకట్ట…

Share

ఆదాయ లీకేజీలకు అడ్డుకట్ట.
* పర్యవేక్షణకు ‘చేజింగ్ సెల్’.
* బడ్జెట్ లక్ష్యాల సాధనపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం.
* ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర బడ్జెట్‌ లక్ష్యాలను చేరుకునే దిశగా ఆదాయ సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదాయ పెంపు, వనరుల సమీకరణ తదితర అంశాలపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ సంస్థలు ఆదాయ సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలలో ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఆదాయ పెంపు, నిధుల సమీకరణ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని అధికారులకు తేల్చిచెప్పారు.
ప్రభుత్వ లక్ష్యాలను అనుకున్న స్థాయిలో సాధించాలంటే ఆయా శాఖల వారీగా పనితీరును, సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు అనుగుణంగా శాఖల వారీగా బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ కేవలం ఊహాజనితంగా ఉండకూడదని, వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. వాస్తవ అంచనాలతో ముందుకెళ్లినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. లక్ష్యాల సాధనలో ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా అధికారులకు భరోసా కల్పించారు.