మూడు రాజధానుల నుంచి ‘మావిగన్’ దాకా.. అదంతా మోసమే!
* వైసీపీది ‘గొడ్డలి’ పార్టీ.. అమరావతిపై దండయాత్ర తగదు.
* మహిళలపై అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు.
*నెల్లూరు జిల్లా ‘పేదల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం.
నెల్లూరు, మహా.
గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని తీవ్ర గందరగోళానికి గురి చేసిన వైసీపీ, ఇప్పుడు ‘మావిగన్’ అనే కొత్త పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.అసలు మావిగన్ అనే పదానికి అర్థం ఏమిటో తనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల విధానంతో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని గత ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడివారు తమ రాజధాని గురించి గర్వంగా చెప్పుకుంటారని, కానీ మనకు మూడు రాజధానులు ఉన్నాయని చెప్పాల్సి రావడం వల్లే ప్రజలు నవ్వుకున్నారని సీఎం గుర్తుచేశారు. ఈ అనాలోచిత విధానాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించబట్టే ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనపెట్టి కొత్త నినాదంతో ముందుకు రావడం మోసపూరిత చర్యేనని దుయ్యబట్టారు.
అమరావతి రాజధాని కోసం సుమారు 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని చంద్రబాబు కొనియాడారు. అలాంటి పవిత్రమైన ప్రాంతంలో పంటలకు నిప్పులు పెట్టడం, రైతులను నానా ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక రాజధానిపై విషం చిమ్మారని, అమరావతిపై దండయాత్రలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇకపై వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా పిలవాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా గతంలో ఎన్నో వ్యక్తిగత దాడులు జరిగాయని, తిరుమల అలిపిరి వద్ద తనపై బాంబు దాడి జరిగినప్పుడు ఆ శ్రీ వేంకటేశ్వర స్వామే తనను కాపాడారని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో రోజుకో ఫేక్ న్యూస్ సృష్టించి అశాంతి రగిల్చే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారి యువత జీవితాలు నాశనమయ్యాయని, ఇప్పుడు ఆ పరిస్థితులను పూర్తిగా నిర్మూలించే దిశగా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన కుమార్తెపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం అత్యంత దారుణమన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తన భార్యను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి వికృత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవ’ కార్యక్రమంలో పాల్గొనడం తనకు పండుగ లాంటిదని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తాను కేవలం బటన్ నొక్కి డబ్బులు పంపే నాయకుడిని కాదని, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకునే వ్యక్తినని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, సామాజిక భద్రతా పెన్షన్ల కోసమే ఏడాదికి రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.
నెల్లూరు జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే గత ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు నూతన పరిశ్రమల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసికట్టుగా అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన కారణంగా రాష్ట్రం తీవ్రంగా వెనుకబడిందని, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అవినీతి రహిత పాలనను అందించి, రాష్ట్రంలో సుపరిపాలన స్థాపించడమే తమ కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.








