Mahaa Daily Exclusive

  అస్సాంలో 26 మంది అటవీ సిబ్బంది క్షేమం…..

Share

అస్సాంలో 26 మంది అటవీ సిబ్బంది క్షేమం.
• రెండు రోజుల గాలింపునకు సుఖాంతం.

గువాహటి,మహా.
అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రెండు రోజులుగా గల్లంతైన 23 మంది అటవీ అధికారులు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా మొత్తం 26 మంది సురక్షితంగా లభ్యమవడంతో అటవీశాఖతో పాటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతోనే వారితో సంబంధాలు తెగిపోయాయని, గాలింపు చర్యల అనంతరం బృందాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అస్సాం అటవీశాఖ మంత్రి జయంత మల్లబారువా వెల్లడించారు.

దిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో అధికారులు తరచూ పెట్రోలింగ్, కూంబింగ్ ఆపరేషన్లు, అటవీ సర్వేలు నిర్వహిస్తుంటారు. ఇదే క్రమంలో శుక్రవారం 23 మంది అటవీ అధికారులు, ముగ్గురు సహాయక సిబ్బందితో కూడిన బృందం అధికారిక విధుల నిమిత్తం అడవిలోకి వెళ్లింది. అయితే ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా లేకపోవడంతో శుక్రవారం నుంచి వారితో ఎలాంటి సమాచార మార్పిడి జరగలేదు.

రెండు రోజుల పాటు బృందం ఆచూకీ లభించకపోవడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమై భారీ గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానిక అటవీ సిబ్బంది, ప్రత్యేక బృందాలు, స్థానికుల సహకారంతో అడవిలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించింది.

లాంగ్టింగ్, మందర్‌దిసా, హాతిఖోలా, మైబోంగ్ రేంజ్‌లకు చెందిన ఈ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అటవీశాఖ మంత్రి జయంత మల్లబారువా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు.

సిబ్బంది సురక్షితంగా తిరిగి రావడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊరట వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మారుమూల అటవీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర సమాచార పరికరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది.