Mahaa Daily Exclusive

  అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ….

Share

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ.
* విద్యార్థులపై బలప్రయోగంపై వివరణ కోరిన ప్రతిపక్ష నేత.
ఢిల్లీ, మహా.
ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘాటు లేఖ రాశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, నిరసనకారులపై పెల్లెట్ గన్‌ల వినియోగం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై బలప్రయోగానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో దేశానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.

జూలై 20న జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తన లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. పెల్లెట్ గన్ దాడిలో 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ తీవ్రంగా గాయపడి కంటి చూపు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని అభిప్రాయపడ్డారు.

నిరసనల సమయంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని, వారు పోలీసులు లేదా ఇతర భద్రతా సిబ్బందా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా ఆందోళన చేస్తున్న వారిపై బలప్రయోగం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారనే అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు.

ఈ ఘటనలో యువతులు సహా వందలాది మంది విద్యార్థులు గాయపడినట్లు పేర్కొంటూ, శాంతియుత నిరసన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నిరసనకారుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, బలప్రయోగానికి బదులుగా చర్చలు, సంభాషణల ద్వారానే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి దిగడానికి కారణమైన పరిస్థితులు ఏమిటి? ఆ నిర్ణయం ఎవరి ఆదేశాలతో తీసుకున్నారు? అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అంశం సభలోనూ తీవ్ర చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.