Mahaa Daily Exclusive

  కల్తీరాయుళ్లపై ఉక్కుపాదం…

Share

కల్తీరాయుళ్లపై ఉక్కుపాదం.
* రంగంలోకి ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్.
*రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.
* 1500 మంది సిబ్బంది, కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు.

హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్న ఆహార, ఔషధ కల్తీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. కల్తీ ఆహారం కారణంగానే ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన సర్కార్, దీనిని సమూలంగా నిర్మూలించేందుకు ఏకంగా ఒక ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను రంగంలోకి దించబోతోంది. ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), ఫుడ్ సేఫ్టీ వింగ్ (ఎఫ్ఎస్ఈడబ్ల్యూ)లను ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో అనుసంధానించి ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విభాగానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతి నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

**పోలీసుల ఎంట్రీతో ముమ్మర తనిఖీలు**

క్షేత్రస్థాయిలో తనిఖీలకు వెళ్లే ఫుడ్ ఇన్ స్పెక్టర్లను హోటల్ యజమానులు లెక్కచేయకపోవడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఈ కొత్త టాస్క్ ఫోర్స్ లో ఏకంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నుంచి ఎంపిక చేసిన 150 మంది పోలీసులను చేర్చనున్నారు. ఇకపై నమూనాల సేకరణకు వెళ్లే డ్రగ్, ఫుడ్ ఇన్ స్పెక్టర్ల బృందంలో ఖచ్చితంగా పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. ప్రస్తుతం నారాయణగూడలోని ఐపీఎం, నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలలో ఉన్న 300 మంది సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరు తరహాలో నూతన విభాగానికి సుమారు 1500 మంది సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

**లక్షకు పైగా ఆహారశాలలు.. గుట్టురట్టవుతున్న కల్తీ**

సుమారు కోటి జనాభా ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోనే అధికారికంగా 1.25 లక్షల రిజిస్టర్డ్ ఆహారశాలలు ఉన్నాయి. చిరు వ్యాపారులను కూడా కలుపుకుంటే వాస్తవానికి ఈ సంఖ్య నాలుగు రెట్లు ఉంటుందని అంచనా. ఇటీవలి కాలంలో హెచ్-ఫాస్ట్ బృందాలు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఏకంగా 122 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి 185 మందిపై కేసులు నమోదు చేశారు. వీధి వ్యాపారులు, చిన్న హోటళ్లలో జంతు కళేబరాలతో తయారు చేసిన నూనెలు, కొవ్వులతో పాటు కల్తీ పాలు, పనీర్ వంటివి విరివిగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

**ల్యాబ్‌ల సామర్థ్యం పెంపు.. ప్రత్యేక ఠాణా**

కేసులు నమోదు చేస్తున్నప్పటికీ నమూనాల విశ్లేషణ ఫలితాల కోసం ల్యాబ్ ల వద్ద తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న నమూనాలతో నాచారం ల్యాబ్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ప్రస్తుతం నెలకు వెయ్యి నమూనాలను మాత్రమే పరీక్షించే సామర్థ్యం ఉన్న ఈ ల్యాబ్ కెపాసిటీని, ఏకంగా 4 వేల శాంపిల్స్ పరీక్షించేలా అప్ గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా, కల్తీ కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆరుగురు ఏసీపీ స్థాయి అధికారులను కేటాయించాలని నిర్ణయించారు. కేసు నమోదు నుంచి మొదలుకొని, న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేసి శిక్ష పడే వరకు ఈ విభాగమే పూర్తి బాధ్యత వహించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో కల్తీరాయుళ్ల ఆటలు పూర్తిగా కట్టడి కావడం ఖాయంగా కనిపిస్తోంది.