- పన్ను వసూళ్లపై శ్రద్ధ.. ప్రజల భద్రతపై లేదా?
- బెండపూడిలో ‘సత్యదేవా రెసిడెన్సీ’పై పలు ప్రశ్నలు
- అనుమతులు, డ్రైనేజీ, పార్కింగ్, ఫైర్ సేఫ్టీపై సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్
కాకినాడ, మహా ప్రతినిధి :
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ‘శ్రీ సత్యదేవా రెసిడెన్సీ, ఫంక్షన్ హాల్ అండ్ రూమ్స్’ భవనంపై పలు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే 2015లో నిర్మించిన ఈ ఐదు అంతస్తుల కమర్షియల్ భవనానికి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్, లేఅవుట్ అనుమతుల రికార్డులు తమ వద్ద లేవని పంచాయతీ అధికారులు చెప్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే అదే భవనానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.71,704 హౌస్ ట్యాక్స్ వసూలు చేసిన చలానా పత్రాలు ఉన్నాయని ‘మహా పత్రిక’ పరిశీలనలో వెల్లడైంది. డోర్ నెంబర్ 1-100, అసెస్మెంట్ నెంబర్ 199858000005లో గొల్లపల్లి సూర్యనారాయణ పేరుతో ఈ పన్ను వసూలైనట్లు పత్రాల్లో ఉంది. అనుమతుల రికార్డులు లేవని చెబుతున్న సమయంలో పన్ను మాత్రం ఎలా వసూలు చేశారన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
*భక్తుల రద్దీ ప్రాంతంలో పార్కింగ్ ఎక్కడ?*
అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా రూములు, వసతి కోసం వచ్చే పర్యాటకుల రద్దీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఉన్న భారీ కమర్షియల్ భవనానికి సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీ గదులకు రోజుకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నప్పటికీ.. తమ వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం లేకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫంక్షన్ హాల్‌కు వచ్చే వారు, రూములు తీసుకునే పర్యాటకులు తమ వాహనాలను ప్రధాన రహదారి పక్కనే నిలిపివేయాల్సి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు.
*ప్రభుత్వ డ్రైనేజీపై స్లాబ్?*
భవనం ముందు వైపు ఉన్న ప్రభుత్వ మురుగు కాలువను మూసివేసి దానిపై స్లాబ్ ఏర్పాటు చేశారన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ. దీంతో మురుగు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి, కాలనీ పరిసరాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. డ్రైనేజీ సక్రమంగా ప్రవహించక మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని వారు చెబుతున్నారు.
*టౌన్ ప్లానింగ్ నిబంధనలు అమలయ్యాయా?*
ఇంత పెద్ద కమర్షియల్ భవనానికి అవసరమైన పార్కింగ్ సదుపాయం ఉందా? గ్రౌండ్ ఫ్లోర్‌ను ఏ విధంగా వినియోగిస్తున్నారు? నిర్మాణానికి ముందు బిల్డింగ్ ప్లాన్, లేఅవుట్ అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్కింగ్‌కు తగిన స్థలం లేకపోవడం వల్ల రోడ్డుపైనే వాహనాలు నిలుస్తుండటంతో సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
*ఫైర్ సేఫ్టీపై ప్రశ్నలు*
ఫంక్షన్ హాల్‌లో వందలాది మంది ఒకేసారి చేరే అవకాశం ఉండటంతో అగ్నిమాపక భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవనం వెనుక వంటల కోసం కిచెన్ షెడ్ కూడా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌కు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ ఉందా? లేదా? అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం లేదా ఇతర ప్రమాదం జరిగితే ప్రజల భద్రత కోసం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనే దానిపై కూడా సంబంధిత శాఖలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
*సంయుక్త విచారణకు డిమాండ్*
ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై కేవలం ఒక శాఖతో కాకుండా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్, గ్రామ పంచాయతీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని బెండపూడి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు, పన్ను అసెస్మెంట్, ప్రభుత్వ డ్రైనేజీ స్థితి, పార్కింగ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ అనుమతులు తదితర అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉన్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులను స్థానికులు కోరుతున్నారు.
*పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రతపై లేదా?*
ఒకవైపు భవన అనుమతులకు సంబంధించిన రికార్డులు లేవని అధికారులు చెబుతుండగా.. మరోవైపు అదే భవనానికి రూ.71,704 పన్ను వసూలైన పత్రాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అన్నవరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు వచ్చే ప్రాంతంలో భారీ కమర్షియల్ భవనానికి పార్కింగ్ సదుపాయం లేకపోవడం, డ్రైనేజీ సమస్యలు, ఫైర్ సేఫ్టీపై స్పష్టత లేకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్ను వసూలు చేసే సమయంలో కనిపించిన భవనం.. నిబంధనల తనిఖీ సమయంలో ఎందుకు కనిపించలేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.








