- బీఆర్ఎస్ నేత హరీశ్ రావు
సిద్ధిపేట,మహా.
‘సిద్ధిపేట జిల్లా పదేళ్ల ఉత్సవాలు’ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు, ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట చరిత్రను, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని యువత తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎంతో మంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు మనం ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ.. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహానుభావులు జీవితాంతం తెలంగాణ ఆకాంక్షకోసమే తపించారని హరీశ్ రావు కొనియాడారు. “నీకు పదవి కావాలా, తెలంగాణ కావాలా?” అని ప్రశ్నిస్తే.. ఏమాత్రం ఆలోచించకుండా తెలంగాణే కావాలని కోరుకున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. 2001లో తనకున్న అన్ని పదవులను తృణప్రాయంగా వదిలేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ బాట పట్టారని, 2014లో చావు నోట్లో తలపెట్టి మరీ ఆమరణ దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. రాష్ట్రం సాధించి ఊరుకోకుండా, కేసీఆర్ నాయత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లోనూ అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు.
అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ..
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, నేడు జిల్లాకో మెడికల్ కాలేజీతో కలిపి మొత్తం 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. అప్పట్లో కేవలం 2,780 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 10,000కి చేరిందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో, ఎంబీబీఎస్ సీట్లలో, డాక్టర్ల ఉత్పత్తిలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గర్వంగా చెప్పారు. “ఒకప్పుడు ‘ఈరోజు బెంగాల్ ఏం చేస్తుందో, రేపు దేశం అది చేస్తుంది’ అనే నానుడి ఉండేది.. కానీ నేడు ‘తెలంగాణ ఏది ఆచరిస్తుందో రేపు దేశం అది ఆచరిస్తుంది’ అనే స్థాయికి మన రాష్ట్రం ఎదిగింది” అని ఆయన ఉద్ఘాటించారు.
ప్రజలకు చేరువయ్యేందుకే జిల్లాల విభజన..
పరిపాలన మరింత సులభతరం కావడానికి, అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ జిల్లాల విభజన చేపట్టారని హరీశ్ రావు తెలిపారు. జిల్లా ఏర్పాటు అంటే కేవలం హద్దులు (బౌండరీస్) మార్చడం కాదని, ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. జిల్లా ఏర్పాటుతో లబ్ధి పొందని ఒక్క కుటుంబం కూడా లేదని, సిద్ధిపేట జిల్లా ఏర్పడక ముందు ఎలా ఉంది, జిల్లా ఏర్పాటయ్యాక ఎలా రూపాంతరం చెందింది, రేపటి సిద్దిపేట ఎలా ఉండబోతోంది అనే స్పష్టమైన దృక్పథంతో అంతా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.








