Mahaa Daily Exclusive

  ఢిల్లీలో హైఅలర్ట్..

Share

  •  సీజేపీ ఆందోళన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.
  •  జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు.
  •  ఢిల్లీలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

న్యూఢిల్లీ, మహా.

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ శనివారం జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన భారీ ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి, భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించింది.

ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 7 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా ఢిల్లీకి రప్పించారు. మొత్తంగా 20 వేలకు పైగా పోలీసు, పారామిలటరీ బలగాలతో నగరంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అల్లర్లు జరిగినా అణచివేసేందుకు, గుంపులను చెదరగొట్టేందుకు యాంటీ-రైట్ ఆయుధాలతో బలగాలను రంగంలోకి దించారు.

హోంమంత్రి స్వయంగా పర్యవేక్షణ

ఢిల్లీలో నెలకొన్న తాజా భద్రతా పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వివిధ రాష్ట్రాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. శనివారం నాటి ఆందోళనల తీరుతెన్నులపై అత్యున్నత స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టదలచిన నిరసనకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టంగా అనుమతి నిరాకరించారు. ఆ ప్రాంతంలో, పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163 అమలులో ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. నిరసనల పేరుతో ఉద్రిక్తతలను సృష్టించే విధంగా తప్పుడు సమాచారం లేదా వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలను అడ్డుకోవడానికి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తీవ్ర నిఘా నీడలో తనిఖీ చేస్తున్నారు.

ప్రజలకు అధికారుల సూచనలు

శనివారం జరగనున్న నిరసనల నేపథ్యంలో నగర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సృష్టి పాండే సూచించారు. అత్యవసర పనులపై విధులకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఎవరూ ఈ నిరసనల్లో పాల్గొనవద్దని, తమ కుటుంబ సభ్యుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా శుక్ర, శనివారాల్లో ఢిల్లీ నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.