- మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
- పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
- అంబటి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల కౌంటర్
గుంటూరు,మహా.
మరో రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆరు నెలల పాటు తానే హోంమంత్రిగా ఉంటానని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గుంటూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలి సరిగా లేదని, వారు అధికార టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అక్కడున్న వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన, అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
టీడీపీ శ్రేణుల విమర్శలు:
అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని, ఎన్నికలకు ముందే హోంమంత్రి పదవిపై ఆయన పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు:
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.








