- పెళ్లి పేరుతో 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా వేసిన కేటుగాడు అరెస్ట్!
- ఢిల్లీలో వెలుగు చూసిన సంచలన మోసం.
న్యూఢిల్లీ, మహా.
సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్‌స్టైల్ బిల్డప్ ఇస్తూ, తాను ఒక పెద్ద వ్యాపారవేత్తనని నమ్మబలికిన ఓ కేటుగాడి బాగోతం తాజాగా బట్టబయలైంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు నకిలీ ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శించిన ఈ వంచకుడు.. ఏకంగా ఖాకీ దుస్తుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లనే తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 20 మంది మహిళా పోలీసుల నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన ఈ సంచలన ఘటన దేశ రాజధాని దిల్లీలో కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. దిల్లీలోని బురారి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల విక్రాంత్ తోమర్ సోషల్ మీడియాను మోసానికి ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, రిచ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తను ఒక ప్రముఖ వ్యాపారవేత్తనని నమ్మబలికాడు. ముఖ్యంగా ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒకే బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుళ్లను టార్గెట్ చేసుకుని వారి పరిధిని విస్తరించుకున్నాడు. వారిని ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తూ విడతల వారీగా ఏకంగా రూ. 24 లక్షల వరకు కాజేశాడు. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
అసలు ట్విస్ట్.. సహజీవన భాగస్వామి సహకారంతోనే..
ఈ కేసులో పోలీసులను సైతం విస్మయానికి గురిచేసిన ఒక షాకింగ్ నిజం వెలుగుచూసింది. నిందితుడు విక్రాంత్ తోమర్‌తో కలిసి సహజీవనం చేస్తున్న మహిళ కూడా సాక్షాత్తు దిల్లీ పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె ద్వారానే తన బ్యాచ్‌కి చెందిన తోటి మహిళా కానిస్టేబుళ్ల పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లను నిందితుడు సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఈ దారుణమైన పద్ధతిలో ఇతను దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసపు వలలోకి లాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, సమాజంలో పరువు పోతుందనే భయంతో వీరిలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగా, మరికొందరు ఇంకా బయటకు రాలేదని తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్‌లలో లూటీ సొమ్ము మళ్లింపు
బాధితుల నుంచి నమ్మించి వసూలు చేసిన ఆ రూ. 24 లక్షలను నిందితుడు విక్రాంత్ తోమర్ ఎక్కడా దాచకుండా.. ‘వన్-ఎక్స్’ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో అనుసంధానించిన ఖాతాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతని నేర చరిత్రను పరిశీలిస్తే.. ఇప్పటికే మాయాపురి, హరి నగర్, ఇందర్‌పురి తదితర ప్రాంతాల్లో పలు కేసులు, ఐదు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. గతంలోనూ నేరాలకు పాల్పడి జైలుకెళ్లిన ఇతను, ఈ ఏడాది జూన్‌లోనే బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ తన పాత దందాను కొనసాగించడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ సెంట్రల్ జిల్లా సైబర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతైన విచారణ జరుపుతున్నారు. బాధితులు ఎవరైనా భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.







