- న్యాయపరమైన చిక్కులకు చెక్.
- నివాసయోగ్యమైన ప్రాంతాల్లో పారదర్శకంగా స్థలాలు.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన!
హైదరాబాద్, మహా.
జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేసే ప్రక్రియపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన చేస్తూ స్పష్టమైన కార్యాచరణను వెల్లడించారు. జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని భరోసానిచ్చారు. ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా, అన్ని సౌకర్యాలతో కూడిన నివాసయోగ్యమైన ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన గత పరిణామాలు, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన చిక్కులను మంత్రి పొంగులేటి వివరంగా ప్రస్తావించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాము పలుమార్లు చర్చించామని, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా సమీక్షిస్తోందని తెలిపారు. గతంలో 2008లోనే జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూముల కేటాయింపునకు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత కోర్టుల్లో వేసిన పిటిషన్ల కారణంగా ఈ ప్రక్రియ తీవ్రంగా నిలిచిపోయిందని గుర్తుచేశారు. అయితే సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం 2022లో అడ్డంకులు తొలగిపోయాయని, దానిని ముందుకు తీసుకువెళ్తూ 2024 సెప్టెంబర్ 8వ తేదీన అధికారికంగా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించామని మంత్రి వివరించారు.
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం వారి ఇళ్ల స్థలాల కలలను సాకారం చేసేందుకు అన్ని చర్యలు వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి విధివిధానాలు, స్థలాల కేటాయింపు వివరాలు వెలువడనున్నాయి.







