- సింగిల్ యూజ్ మెడికల్ డివైజెస్ పునర్వియోగంపై కేంద్రం కఠిన నిషేధం!
- కార్డియోలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాల్లో రీసైక్లింగ్ దందాలు.
- హెచ్ఐవీ, హెపటైటిస్ ముప్పు ఉందంటూ రాష్ట్రాలకు డీజీహెచ్ఎస్ హెచ్చరిక!
న్యూఢిల్లీ, మహా.
వైద్య ఆరోగ్య రంగంలో ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గట్టి కళ్లెం వేసింది. ఒకసారి వాడిపారేసే (సింగిల్ యూజ్) వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువులను మళ్లీ మళ్లీ ఉపయోగించే దారుణమైన సంస్కృతిపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఈ నిషేధాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత కఠినంగా అమలు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 16న అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాసిన డీజీహెచ్ఎస్.. రోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రులు సాగిస్తున్న ఈ అనైతిక దందాను తీవ్రంగా తప్పుబట్టింది.
దేశంలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకసారి వాడిపారేసే వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేసి మళ్లీ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డీజీహెచ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కార్డియోలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, వ్యాస్కులర్ సర్జరీ, న్యూరోసర్జరీ వంటి అత్యంత కీలకమైన విభాగాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలిందని వెల్లడించింది. కార్డియాక్ క్యాథటర్స్, గైడ్వైర్స్, బెలూన్ అండ్ అబ్లేషన్ క్యాథటర్స్, డయాలసిస్ పరికరాలు, సర్జికల్ స్టేప్లర్స్, ల్యాప్రోస్కోపిక్ ట్రాకార్స్, ఆర్థోపెడిక్ డ్రిల్ బిట్లు, సిరంజీలు, సూదులు వంటి అత్యంత సున్నితమైన వస్తువులను కూడా రీసైకిల్ చేసి వాడుతున్నట్లు పేర్కొంది.
ఇలాంటి పరికరాలను ఎన్నిసార్లు స్టెరిలైజ్ చేసినా రోగులకు ఇన్ఫెక్షన్ల ముప్పు వంద శాతం ఉంటుందని, అంతేకాకుండా హెపటైటిస్ బీ, సీతో పాటు హెచ్ఐవీ , ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. మరోవైపు, ఒకసారి వాడిపారేయాల్సిన పరికరాలకే రోగుల నుంచి సరికొత్త వాటి పేరుతో వంద శాతం చార్జీలు వసూలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులు భారీగా దోచుకుంటున్నాయని విమర్శించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్ వైద్య పరికరాలను మళ్లీ వాడకుండా కఠినంగా నిషేధం అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలకు డీజీహెచ్ఎస్ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940, మెడికల్ డివైజెస్ నిబంధనలు-2017, అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం అటువంటి పరికరాలను పునర్వినియోగించడం చట్టరీత్యా నేరమని వెల్లడించింది. ఈ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించడంతో వైద్యవర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.







