- హైదరాబాద్‌కే పరిమితమైతే ఊరుకునేది లేదు.
- ప్రజల్లోకి వెళ్లి చాయ్ తాగుతూ మమేకంకండి.
- తెలంగాణ బీజేపీ నేతలపై సునీల్ బన్సల్ క్లాస్.
హైదరాబాద్, మహా.
చేతకాకపోతే పదవులు వదిలేసి తప్పుకోండి.. అంతేగానీ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైతే మాత్రం ఊరుకునేది లేదు!” అంటూ తెలంగాణ బీజేపీ నాయకుల తీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బహిరంగ సభల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, నేరుగా ప్రజల్లోకి వెళ్లి చిన్న చిన్న సమూహాలతో కలిసి కింద కూర్చుని చాయ్ తాగుతూ వారిలో మమేకం కావాలని ఆయన నేతలకు గట్టి హుకుం జారీ చేశారు. శనివారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సునీల్ బన్సల్ చేసిన ఈ సీరియస్ వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీలో అలజడిని సృష్టించాయి.
తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదని, నాయకులు రాజధాని పరిధిలోని రాష్ట్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మాని వెంటనే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాలని బన్సల్ గట్టిగా హెచ్చరించారు. ఆఫీసులకే పరిమితమై, కేవలం సమీక్షల పేరుతో కాలక్షేపం చేసే నేతల తీరు ఇకపై పార్టీలో చెల్లదని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో గొంతుచించుకుని పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం వల్ల ప్రజల్లో ఎలాంటి మైలేజ్ రాదని, అంతకంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లి చిన్న చిన్న సమూహాలతో మమేకమై, నలుగురితో కలిసి కింద కూర్చుని చాయ్ తాగుతూ సమస్యలపై మాట్లాడితేనే అసలైన రాజకీయ ప్రభావం ఉంటుందని ఆయన హితవు పలికారు.
పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన కార్యక్రమాలను అమలు చేయడంలోనూ కొందరు నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని బన్సల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్దేశించిన కనీసం రెండు, మూడు కార్యక్రమాలను కూడా క్షేత్రస్థాయిలో పరిపూర్ణంగా అమలు చేయకపోతే ఎలా అని ఆయన సూటిగా నిలదీశారు. చేతకానితనాన్ని ఇకపై సహించేది లేదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి పోరాటాలే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేయడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.








