Mahaa Daily Exclusive

  పురపాలక ఎన్నికల్లో ‘కూటమి’ జోరు..

Share

  • పురపాలక ఎన్నికల్లో ‘కూటమి’ జోరు
  • 17 చోట్ల ఏకగ్రీవం
  • రాయలసీమలో హవా

 

అమరావతి, మహా : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన ఆదివారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు గాను 17 స్థానాలను కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

 

కొందరు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ దాఖలైన ఫిర్యాదులపై విచారణ జరిపిన అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ను సవరించింది. అక్టోబర్ 18తో నామినేషన్ల గడువు ముగియాల్సి ఉండగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులు జరిగాయన్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. 19 మున్సిపాలిటీల పరిధిలో తమ అభ్యర్థులపై ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులు చేసి, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారని, 87 ప్రాంతాల్లో అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ వైఎస్సార్ కడప జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్, రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో నామినేషన్ల సమర్పణకు అదనంగా 48 గంటల సమయం కల్పించింది. ఈ మార్పుల అనంతరం, 13 మున్సిపల్ కార్పొరేషన్లతో సహా మొత్తం 100 పురపాలక సంస్థలకు నవంబర్ 1న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

 

17 చోట్ల ఏకగ్రీవం…. కూటమి హవా

 

అధ్యక్ష పదవులతో సహా ఏకగ్రీవమైన 17 పురపాలక సంఘాల్లో టీడీపీ ఏకంగా 15 స్థానాలను కైవసం చేసుకోగా…. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 10 అర్బన్ వార్డులు, 7 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా భావించే రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కూటమి ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన పురపాలక సంఘాల్లో అత్యధికంగా రాయలసీమ పరిధిలోనే 11 స్థానాలు ఉండటం విశేషం. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో 3, పాత ప్రకాశం జిల్లా పరిధిలో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

 

ఏకగ్రీవంగా గెలుచుకున్న మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు

 

పుంగనూరు, రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, అల్లగడ్డ, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, ఆత్మకూరు, గుత్తి, కనిగిరి స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీ అధ్యక్ష పదవిని జనసేన పార్టీ దక్కించుకుంది. ఎర్రగుంట్ల నగర పంచాయతీ అధ్యక్ష స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మాజీ సీఎం సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ నేతృత్వంలోని కూటమి నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో అధ్యక్ష పదవులన్నింటినీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం స్థానాలను టీడీపీ దక్కించుకోగా, ఎర్రగుంట్లను బీజేపీ ఖాతాలో వేసుకుంది.

 

వార్డుల వారీగా ఏకగ్రీవాల వివరాలు

 

రాజంపేట : మొత్తం 32 వార్డులకు గాను 14 వార్డుల్లో టీడీపీ, 1 వార్డులో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

ప్రొద్దుటూరు : 52 వార్డుల్లో టీడీపీ ఏకంగా 51 వార్డులను దక్కించుకోగా, మిగిలిన ఒక్క వార్డును బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.

బద్వేల్ : 40 వార్డుల్లో టీడీపీ 35, జనసేన 2 స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు.

మైదుకూరు : 32 వార్డుల్లో 17 వార్డులను టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 15 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

కమలాపురం : 23 వార్డులు ఉన్న ఈ నగర పంచాయతీలో టీడీపీ 22, బీజేపీ 1 వార్డును గెలుచుకున్నాయి.

ఎర్రగుంట్ల : 28 వార్డుల్లో టీడీపీ 17, బీజేపీ 10 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నాయి.

పులివెందుల : వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీలోని 40 వార్డులకు గాను టీడీపీ 19, బీజేపీ 1 స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నాయి. మిగిలిన 20 వార్డులతో పాటు ఛైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

 

కార్పొరేషన్లలోనూ అదే జోరు

 

కడప కార్పొరేషన్ : మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీడీపీ 47 డివిజన్లను, బీజేపీ 2, జనసేన 1 డివిజన్‌ను ఏకగ్రీవం చేసుకున్నాయి. మేయర్ పదవితో పాటు మిగిలిన 16 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

చిత్తూరు కార్పొరేషన్ : 60 డివిజన్లకు గాను 48 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన, బీజేపీ, వైఎస్సార్సీపీలు తలో డివిజన్‌ను దక్కించుకున్నాయి.

తిరుపతి కార్పొరేషన్ : 66 డివిజన్లలో టీడీపీ రెండు చోట్ల ఏకగ్రీవ విజయం సాధించింది.

ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదు కాలేదు. పాత గోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు పరిమిత సంఖ్యలో ఏకగ్రీవ విజయాలు సాధించారు.

 

ఏకగ్రీవ ఛైర్‌పర్సన్ లు వీరే …

 

పల్నాడు జిల్లా దాచేపల్లి – తంగెళ్ల శ్రీనివాసరావు (టీడీపీ)

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల – బాబావలి (టీడీపీ)

పల్నాడు జిల్లా గురజాల – నెలవల్లి బాల్ రెడ్డి (టీడీపీ)

ప్రకాశం జిల్లా దర్శి – దారం సుబ్బారావు (జనసేన)

మార్కాపురం జిల్లా కనిగిరి – అచ్చాల తిరుపతమ్మ (టీడీపీ)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ – షేక్ అనీషా (టీడీపీ)

నంద్యాల జిల్లా ఆత్మకూరు – డాక్టర్ గోవిందరాజులు (టీడీపీ)

చిత్తూరు జిల్లా నగరి – శ్రీనివాసన్ (టీడీపీ)

వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు – ఎస్. దివ్యతేజ (టీడీపీ)

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు – నంద్యాల రాఘవరెడ్డి (టీడీపీ)

వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం – జి. స్వప్న (టీడీపీ)

వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల – మధులత (బీజేపీ)

వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు – ధనపాల జగన్‌మోహన్ (టీడీపీ)

వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట – దొంతం గాయత్రి (టీడీపీ)

అన్నమయ్య జిల్లా పుంగనూరు – నయీమ్ తాజ్ (టీడీపీ)

అన్నమయ్య జిల్లా రాయచోటి – షేక్ ఖాదర్ వలీ (టీడీపీ)

అనంతపురం జిల్లా గుత్తి – తమిళ్ సెల్వి (టీడీపీ)