Mahaa Daily Exclusive

  తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై సీఎంల కీలక భేటీ…

Share

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై సీఎంల కీలక భేటీ.
– సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.
– సంయుక్త అధికారుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
– ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి బాటలు.
– ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం.

ముంబై, మహా.

తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ముంబై వేదికగా సానుకూల వాతావరణంలో అత్యంత కీలకమైన చర్చలు జరిగాయి. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయింది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున గట్టిగా ప్రతిపాదించగా, దీనిపై మహారాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమావేశ ప్రారంభంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు ఆవశ్యకతను, దాని చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు, అక్కడి గిరిజనులు, ఆదివాసీల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు పాత్ర ఎంతో కీలకమని మహారాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. 1975 అక్టోబర్ 6న అప్పటి సీఎంలు జలగం వెంగళరావు, ఎస్.బి. చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి నేటి వరకు ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. 2016లో నిర్ణయించిన 148 మీటర్ల ఎత్తుతో తెలంగాణ నీటి అవసరాలు పూర్తిస్థాయిలో నెరవేరవని, ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడమే సరైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారమే పూర్తి స్థాయి పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, ఆదివాసీ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎంతగానో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ, దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, ఆర్థిక కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాకుండా, తెలంగాణ, మహారాష్ట్రలను మరింత అనుసంధానించే మైత్రి వారధిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందిస్తూ, తనకు తెలుగు రాష్ట్రాలతో, ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు ప్రతిపాదనను పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, దీనివల్ల జరిగే ముంపు ప్రభావం, నీటి లభ్యత, పర్యావరణ మరియు సాంకేతిక అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలకు ఎటువంటి ప్రతికూల ప్రభావం కలగకపోతే గత ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో సంయుక్త అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. కేంద్ర జల సంఘం సహకారంతో అవసరమైన అన్ని అధ్యయనాలు పూర్తి చేసి, ముంపు భూముల గుర్తింపు, పరిహార చెల్లింపులపై తదుపరి కార్యాచరణను రూపొందించాలని సూచించారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఇరు రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు.