Mahaa Daily Exclusive

  ఖర్గే వ్యాఖ్యలు విచారకరం….

Share

  • ఖర్గే వ్యాఖ్యలు విచారకరం
  • కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు విమర్శలు
  • దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం

 

హైదరాబాద్‌, మహా : ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు మీడియా సమావేశఁలో తీవ్రంగా స్పందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నాయకుడు ఇలాంటి భాష ఉపయోగించడం విచారకరమని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు అధికారానికి దూరంగా ఉండటంతో నిరాశ, అసహనంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత పన్నెండున్నరేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌ నాయకుల్లో అసహనం పెరిగిందన్నారు. ఆ నిరాశతోనే ప్రధాని మోదీని, ఆయన తండ్రిని ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఖర్గే ప్రసంగించిన కార్యక్రమంలో వేదికపై ఉన్న నాయకుల సంఖ్యతో పోలిస్తే కింద ఉన్న ప్రేక్షకులు చాలా తక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

 

బీహార్‌ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలో ఉన్న ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఓడిపోరంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఖర్గే.. “మోదీ కా బాప్‌ భీ జాయేగా” అంటూ వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ ఘటన అక్టోబర్‌ 25న బీహార్‌ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్‌ 139వ జయంతి కార్యక్రమంలో చోటుచేసుకుంది. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం ఈ వ్యాఖ్యలను విమర్శించారు. మరోవైపు, ఈ వ్యవహారంపై పాట్నాలోని కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి.