కరువు ముప్పుపై ప్రభుత్వం అప్రమత్తం కావాలి.
* సూపర్ ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించాలి.
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన జనసేన నేత డాక్టర్ గడల శ్రీనివాసరావు.
హైదరాబాద్,మహా.
రాష్ట్రంలో భూగర్భ జలాల క్షీణత, తీవ్రమైన సాగునీటి కొరత, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమై కరువు నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కరువు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించేందుకు వెంటనే ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. రైతాంగం, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కరువు ముప్పుపై సమగ్ర అంచనా అవసరం
రాష్ట్రంలో సుమారు 24 శాతం వర్షపాత లోటు నమోదైందని, 358 మండలాల్లో తీవ్ర కరువు ముప్పు ఉందని, దాదాపు 6 లక్షల బోర్లు ఎండిపోయినట్లు వస్తున్న సమాచారం అత్యంత ఆందోళనకరంగా ఉందని డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ గణాంకాలను సంబంధిత శాఖలు శాస్త్రీయంగా ధ్రువీకరించి, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వెంటనే ప్రజలకు వెల్లడించాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు, పంటల సాగు విస్తీర్ణం, నీటి వనరుల లభ్యతపై జిల్లాల వారీగా క్షేత్రస్థాయి అంచనాలు నిర్వహించాలని సూచించారు.
సాగు విరామంపై రైతులకు స్పష్టత ఇవ్వాలి
ప్రకృతి వైపరీత్యాలను మానవ ప్రమేయంతో పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాకపోయినా, వాటి దుష్ప్రభావం రైతాంగంపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. రైతులు ఆరు నెలల పాటు పంటలు సాగు చేయవద్దని ముఖ్యమంత్రి సూచించినట్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు పరిస్థితులను ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. పంటల సాగుకు విరామం అవసరమని భావిస్తే, ఆ కాలంలో రైతు కుటుంబాల జీవనోపాధి ఎలా కొనసాగుతుంది, వ్యవసాయ కూలీలకు ఉపాధి ఎలా కల్పిస్తారనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని హితవు పీకారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపకుండా సాగుపై సూచనలు ఇవ్వడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించాలి
రాష్ట్రంలో ముంచుకొస్తున్న కరువు ముప్పు, భూగర్భ జలాల క్షీణత, సాగునీటి సమస్యలు, రైతుల ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించేందుకు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు కోరారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రైతాంగ పరిరక్షణకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. తక్షణ సహాయక చర్యలతో పాటు భవిష్యత్తు నీటి భద్రతకు అవసరమైన దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తాగునీరు, సాగునీరు, విద్యుత్‌కు భరోసా
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ సాగునీటి పంపిణీకి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని డాక్టర్ గడల సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని తెలిపారు.
రైతుల ఆదాయ రక్షణకు ప్రత్యేక ప్యాకేజీ
కరువు పరిస్థితుల వల్ల పంటల సాగు పూర్తిగా సాధ్యం కాని ప్రాంతాల్లో రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. అవసరమైన చోట రుణ ఉపశమనం కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను సృష్టించాలని సూచించారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను కూడా ఈ సహాయక చర్యల్లో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. రైతు కుటుంబాలకు కనీస ఆదాయ భరోసా కల్పించే విధంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, దాని అమలుకు పారదర్శకమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.
ప్రాంతాల వారీగా నీటి లభ్యతను అంచనా వేసి తక్కువ నీటి వినియోగం జరిగే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, పంటల మార్పిడి వల్ల నష్టపోకుండా రైతులకు కనీస మద్దతు ధర, కొనుగోలు వ్యవస్థలపై భరోసా కల్పించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగ సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.








