కిలో రూ.49కే ‘ధరణి’ బ్రాండ్ బియ్యం..
* నిత్యావసరాల ధరలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారుల సమీక్ష.
* దీపావళి నాటికి మొబైల్ వాహనాల ద్వారా సరుకుల పంపిణీ.
* మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి
అమరావతి, మహా.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ‘ధరణి’ బ్రాండ్ బియ్యం సరఫరాను రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు విస్తరించాలని సూచించారు. సరుకులు నేరుగా ప్రజల మునివలికే అందేలా మొబైల్ వాహనాల ద్వారా ధరణి బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కిలో ఫైన్ బియ్యం రూ.49కే, సూపర్ ఫైన్ బియ్యం రూ.50కే, బీపీటీ స్టీమ్ బియ్యం కిలో రూ.66కే విక్రయించాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాక, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కర్నూలు నుంచి సరఫరాను వెంటనే పెంచాలని, వచ్చే దీపావళి పండుగ నాటికి ఈ సరుకుల పంపిణీ ప్రక్రియను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తీరప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. ప్రజలు భయాందోళన చెందవద్దు
నిత్యావసరాల సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను పరిస్థితులు మరియు భద్రతా చర్యలపై మీడియాతో మాట్లాడారు. తుపాను వేగం మరియు దిశ నిమిష నిమిషానికి మారుతున్నందున ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అత్యంత తీవ్ర తుపాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ‘రెడ్ అలర్ట్’ అమల్లో ఉందని తెలిపారు. ప్రజలు ఎవరూ అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అధికారులు సూచించిన తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. తాజా సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
విశాఖపై విరుచుకుపడుతున్న ఈదురుగాలులు.. రంగంలోకి సహాయక బృందాలు
తుపాను ప్రభావంతో విశాఖపట్నం నగరంపై ఈదురుగాలులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలడమే కాకుండా, నిలిపి ఉంచిన కార్లు మరియు ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు వేగంగా రంగంలోకి దిగామని తెలిపారు. సముద్ర తీరాల్లో నిలిపి ఉంచిన బోట్లను రక్షించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన సీఎం, మత్స్యకారులు ఎవరూ ఆయా ప్రాంతాలకు, బోట్ల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు. తుపాను గండం తొలగిపోయే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.








