Mahaa Daily Exclusive

  ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం…

Share

ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం.
* రెండో పంట వేయొద్దని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.

సంగారెడ్డి, మహా.

ప్రస్తుతం మునుపెన్నడూ లేనివిధంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశ రైతాంగం ఎంతో అనుభవజ్ఞులైనందున, రాబోయే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎవరు కూడా రెండో పంటను వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ప్రతిపక్షాలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అన్నదాతలకు అర్థమయ్యేలా చెబితే బాగుంటుందని హితవు పలికారు.
మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జి. వివేక్ వెంకటస్వామి సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ (జడ్పీ) హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో మంత్రులతో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎంపీ ఎం. రఘునందన్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ధరణి బంగాళాఖాతంలోకి.. ‘భూభారతి’ ద్వారా శాశ్వత పరిష్కారం
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద ‘ధరణి’ పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త ‘భూభారతి’ విధానాన్ని తీసుకువచ్చామని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 125 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా పూర్తిస్థాయి భూ సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శాస్త్రీయంగా భూముల రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 380 గ్రామాల్లో భూ సర్వే పూర్తికాగా, ఆయా గ్రామాల్లోని రైతులకు కొత్త భూమి హక్కు పత్రాలను కూడా అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం మరో 900 గ్రామాల్లో భూ సర్వే తుది దశకు చేరుకుందని, రాబోయే ఏడాదిన్నర కాలంలో తెలంగాణ అంతటా ఈ సమగ్ర భూ సర్వే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని నిర్దుష్టమైన భూములను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. దేశంలోనే మొదటిసారిగా ప్రతి భూకమతానికి ప్రత్యేకంగా ‘ఆధార్’ లాంటి ‘భూదార్’ సంఖ్యను తీసుకురాబోతున్నామని వివరించారు.
కేంద్ర నిధులు రావడం ఆలస్యం.. అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తాం
గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడంలో కొంత జాప్యం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అయినప్పటికీ, కేంద్రం తాజాగా రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసిందని వెల్లడించారు. గత గులాబీ పార్టీ (బీఆర్‌ఎస్‌) హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నీ కేవలం ప్రకటనలకే, ఫోటోలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తమది పూర్తిగా ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సంపూర్ణ రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల సాధన కోసం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని, అఖిలపక్ష ప్రతినిధి బృందంగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తామని, రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.