Mahaa Daily Exclusive

  ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్‌…

Share

  • ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్‌
  • క్షణాల్లో ఆరుగురు మృతి
  • బద్రీనాథ్‌ నుంచి డెహరాడూన్ కు వెళ్తుండగా ఘటన

డెహరాడూన్, మహా : ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. బద్రీనాథ్ నుంచి దేహ్రాదూన్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు, ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్‌లో పైలెట్‌, ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్​లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:20 గంటల సమయంలో చమోలి జిల్లా జోషీమఠ్ పరిధిలోని ‘చాయ్’ గ్రామ సమీపంలోకి రాగానే హెలికాప్టర్​ కమ్యూనికేషన్‌ను కోల్పోయింది. అనంతరం ట్రాకింగ్ సిస్టమ్​కు సమాచారం రావడం ఆగిపోయింది. జేపీ పవర్ హౌస్ సమీపంలో ఉన్న ఒక కొండను బలంగా ఢీకొట్టి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బద్రీనాథ్ ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందా? అనేది ఇంకా నిర్ధరణ కావాల్సి ఉందన్నారు. హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయిన తరువాత, ఘటన జరిగిన ప్రాంతంలో పొగలు పైకి లెచినట్లు అధికారులు గుర్తించారు.

హెలికాప్టర్​ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. రెస్క్యూ ఆపరేషన్ల కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో హెలికాప్టర్​ను రంగంలోకి దింపినట్లు చెప్పారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ‘ట్రాన్స్ భారత్ ఏవియేషన్’ అనే ప్రైవేట్ సంస్థకు చెందినదిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది.

పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉత్తరాఖండ్ సీఎం

హెలికాప్టర్​ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. పరిస్థితిని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్టు పెట్టారు. ‘జోషిమఠ్​ సమీపంలోని చాయ్ గ్రామం వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రయాణికులందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ఎక్స్​ పోస్టులో రాసుకొచ్చారు.

మరోవైపు, హెలికాప్టర్​లో ఉన్న ప్రయాణికుల వివరాలను అధికారులు వెల్లడించారు. పైలట్‌ హిమాంశుగా గుర్తించగా, ప్రయాణికులు ప్రతాప, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్, నటరాజ ఐదుగురు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రయాణికుల్లో ఒకరైన అరుణ్ బెంగళూరు పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రయాణికుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

కేదార్‌నాథ్​లో విపరీతంగా కురుస్తున్న మంచు

ఇదిలా ఉండగా, కేదార్‌నాథ్ ధామ్‌లో గురువారం నుంచి నిరంతరాయంగా కురుస్తున్న మంచు కారణంగా, ఈ సీజన్‌లోనే మొదటి భారీ హిమపాతం నమోదైంది. చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ దట్టమైన మంచుతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రానున్న కొద్ది రోజుల్లో, ముఖ్యంగా కొండప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని దేహ్రాదూన్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సి ఎస్ తోమర్ పేర్కొన్నారు. గురువారం, ఉత్తరకాశీ, తెహ్రీ, హరిద్వార్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని తోమర్​ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీతో పాటు నవంబర్ 1,2 తేదీల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో యాత్రికులు, ప్రయాణికుల భద్రత విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్​ ప్రశాంత్​ ఆర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, రహదారుల పరిస్థితిని, యమునోత్రి, గంగోత్రి ఆలయ పరిసరాలను అధికారులు లైవ్ సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.