- 27 న విచారణకు హాజరవాలని నోటీసులిచ్చిన మాసబ్ ట్యాంక్ పోలీసులు
- బంజారాహిల్స్ సీఐ ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు జారీ
హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో సీఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని డిసెంబర్ 6న పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందుహాజరు పరిచినప్పుడు ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, పోలీసులు ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించాలని, విచారణకు హాజరుకావాలని గతంలో బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎల్లుండి మాసబ్‌ట్యాంక్ పోలీసుల ముందు కౌశిక్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 4న పాడి కౌశిక్ రెడ్డితో పాటు దాదాపు 20 మంది తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. అయితే ఎస్‌హెచ్‌వోగా ఉన్న సీఐ రాఘవేంద్ర వేరే పనిమీద బయటకు వెళ్తున్న క్రమంలో సీఐతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా సీఐకి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీఐకు, ఎమ్మెల్యేకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంలో తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్‌హెచ్‌వోగా ఉన్న రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరింత విచారణ కోసం కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశం ఉంది.






