- ఒక్క సారిగా మారిపోయిన వాతావరణం
హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ రాష్ట్రంపైనా ప్రభావం చూపుతోంది. దీంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. నిన్న రాత్రి నుంచే నగరంలోని పలు చోట్ల తేలికపాటి వాన పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. బుధవారం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు అవరించి చల్లటి గాలులు వీస్తున్నాయి. మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. నల్గొండ జిల్లా మాథూరులో 1.1 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెం.మీ వర్షం కురిసింది.
మరోవైపు, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కోస్తా జిల్లాల్లో నేటి నుంచి రెండురోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాలవైపు అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తీరం సమీపంలో కదులుతుండటంతో ఆకాశం మేఘావృతమై తేలికపాటు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, చలి గాలులు కూడా వీస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజులపాటు కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలు చోట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






