- మృత్యుంజయ హోమం కోసం సంచలన నిర్ణయం
- బాలుడి తండ్రికి రూ. 2 లక్షల చెక్కును ఇచ్చిన వేణుస్వామి
హైదరాబాద్, మహా : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ కోసం మహా మృత్యుంజయ హోమం చేయాలని సంకల్పించినట్లు వేణుస్వామి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను బుధవారం పరామర్శించిన వేణుస్వామి తన వంతు సహాయంగా రెండు లక్షల రూపాయ.లను ఇచ్చారు. ఈ మొత్తంతో కూడిన చెక్‌ను భాస్కర్‌కు ఇచ్చారు. భాస్కర్ కుమార్తె కోసం ఈ మొత్తాన్ని ఇచ్చానని ఆ తర్వాత మీడియా ప్రతినిధులకు వివరించారు. దాదాపు వెయ్యి సినిమాల వరకు తాను ముహూర్తాలను పెట్టానని, సినిమా సొమ్మును తిన్నానని, అందుకే ఆ మొత్తంలో కొంత భాస్కర్‌కు ఇచ్చానని పేర్కొన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి విలేకరులు ప్రశ్నించగా.. 90 శాతం వరకు మెరుగుపడిందన్నారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. శ్రీతేజ్ మృత్యువు బారిన పడకుండా తనవంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు వేణు స్వామి తెలిపారు. అపమృత్యు దోషం తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని చెప్పారు. శ్రీతేజ్ కోసం ఏం చెస్తే బాగుంటుందని తాను కొంతమందితో మాట్లాడానని, మృత్యుంజయ హోమం చేయాలని కొందరు సలహా ఇస్తున్నారన్నారు. తన సొంత ఖర్చుతో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని, ఈ విషయాన్ని శ్రీతేజ్ తండ్రికి కూడా తెలియజేశానని వేణుస్వామి చెప్పారు.






