Mahaa Daily Exclusive

  చేతగానప్పుడు.. వాగ్దానాలు చేయొద్దు వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల

Share

ఏపీ: సీఎం చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మహిళలకు దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. నమ్మించి, మాటిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే అంటూ ఆమె ఎద్దేవా చేశారు. చేతగానప్పుడు.. చేయలేనప్పుడు.. శుష్క వాగ్దానాలు చేయకూడదని శ్యామల హితవు పలికారు.

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇదేనా నీ సంతకం విలువ? అంటూ ఆమె ప్రశ్నించారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలన్నారు. హామీలు మాత్రం జనాల్లో ఇచ్చి.. పథకాలను ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెబుతున్నారంటూ ప్రశ్నించారు. తల్లికి వందనం పేరు చెప్పి జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అమ్మ ఒడి పథకాన్ని కూడా ఆపేశారని విమర్శించారు. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనాల్లోకి వచ్చి చెప్పాలంటూ సవాల్ విసిరారు.

జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని నారా లోకేశ్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదు కదా.. కనీసం జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని చెప్పాలన్నారు. హామీలు అమలు చేయనందుకు కూటమి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్‌ ఇప్పుడు సీఎంగా ఉండి ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారని అన్నారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు అంటే ప్రజలకేమో అని అనుకున్నామని.. కానీ ఆయన సొంతంగా సంపద సృష్టించుకోవడం అని ఇప్పుడే తెలిసిందంటూ ఆమె పేర్కొన్నారు.

Latest