విధుల విషయంలో కఠినంగా ఉంటా
అలసత్వం వహిస్తే సహించేది లేదు
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది శాఖకు వన్నే తీసుకురావాలి
డీపీఓలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం
మంత్రిని సన్మానించిన డీపీఓలు
హైదరాబాద్, మహా : వ్యక్తిగా తాను ఎంత సున్నితమో విధుల పట్ల అంతే కఠినంగా ఉంటానని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది మంత్రి సీతక్క స్పష్టం చేసారు. ఉద్యోగుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించినా విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎర్రమంజిల్ లోని గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్ర కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారులతో (డీపీఓ) మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ శ్రీజన తో కలిసి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించారు. మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో అన్ని జిల్లాల డీపీఓల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. గ్రామాల్లో నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం, ఆయా జిల్లాల్లో నెలకొన్ని పరిస్థితులపై చర్చించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా దిశా నిర్దేశం చేసారు. శాఖకు వన్నే తెచ్చే విధంగా పనిచేసి..గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మన దేశం గ్రామాల్లోనే నివసిస్తుందని, అందుకే పల్లెల అభివృద్దిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అయితే పల్లెలను ప్రగతి పథంలో నిలిపేలా డీపీఓలు పనిచేయాలనన్నారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం, గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు సురక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న తాగు నీటి విషయంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు తెరిచేలోపు తాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు హెడ్ మాస్టర్, పంచాయతీ కార్యదర్శిలు సమన్వయంతో వ్యవహరించి ఉదయమే ట్యాంకులు నింపుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆయా జిల్లాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి ప్రణాళికల రూపొందించుకుని, ఆచరణలో పెట్టాలన్నారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కి నందుకు అందరు గర్వపడాలని, ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా ప్రజలకు సేవలిందించాలని తెలిపారు. మానవత్వాన్ని జోడించి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. కొన్ని జిల్లాల్లో అనుకున్నంత మేర పనులు ముందుకు సాగడం లేదని..పొరపాట్లను సరిదిద్దుకుని పనుల్లో వేగం పెంచాలన్నారు. పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో 2017 నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల ఫైల్ ను క్లియర్ చేయించిన విధంగానే డీపీఓల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని సీతక్క స్పష్టం చేసారు. ఇక నుంచి ప్రతి నెల డీపీఓలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. శాఖను తాను కుటుంబంగా భావిస్తానని..గ్రామీణ ప్రజల జీవితాలతో పెనవేసుకున్న పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు తాను మంత్రిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు సామర్ధ్యం ఉండదనే దురాభిప్రాయం సమాజంలో ఉందని..ఆ అభిప్రాయాన్ని పొగొట్టేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ రాజ్ శాఖను సొంత కుటుంభంగా భావించి అధికారులు పనిచేయాలని సూచించారు. ఫీల్డ్ విజిట్స్ పెంచండి, శాఖపై సొంత ముద్ర ఉండేలా ప్రత్యేకతను చాటుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం పచ్చదనం, పనుల జాతరను విజయవంతం చేసినందుకు సీఎం రెవంత్ రెడ్డి అభినందించిన విషయాన్ని గుర్తుచేసారు.





